INDvsAUS: టీమిండియా సారథి రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐడియాతో విభేదించాడు. కోహ్లీ చెప్పినట్టు చేస్తే టెస్టు క్రికెట్ దేశ ప్రజలందరికీ చేరదని అభిప్రాయపడ్డాడు.
టీమిండియా తాజా మాజీ సారథులు కోహ్లీ, రోహిత్ ల మధ్య విభేదాలు ఎప్పట్నుంచో ఉన్నవే. స్వయంగా బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కూడా ఇటీవలే ఈ విషయాన్ని స్టింగ్ ఆపరేషన్ లో కుండబద్దలు కొట్టాడు. తాజాగా రోహిత్ కూడా కోహ్లీతో విభేదించాడు. అయితే ఇదేం ఇద్దరూ నేరుగా చర్చించుకుని చేసిందో లేక ఫ్యాన్స్ సృష్టించిన విభేదాలు కావు. గతంలో కోహ్లీ చెప్పిన ఓ అభిప్రాయంపై రోహిత్ తాజాగా తన స్పందనను తెలియజేశాడు.
భారత్ లో టెస్టు క్రికెట్ ఆడేందుకు గాను కొన్ని వేదికలను ఎంపిక చేసి నిత్యం అక్కడే టెస్టులు ఆడేలా చూడాలని 2017లో కోహ్లీ వ్యాఖ్యానించాడు. అలా అయితే దేశంలోని పలు నగరాలకు బ్రాండింగ్ కూడా ఏర్పడుతుందని కోహ్లీ వాదన.
2017లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘దీనిపై మనం చాలాకాలంగా చర్చించుకుంటున్నాం. నా దృష్టిలో అయితే ఐదు టెస్టు సెంటర్లను ఎంపిక చేసి వాటిలోనే మ్యాచ్ లను ఆడిస్తే మంచిది. ఈ క్రమంలో కొన్ని స్టేట్ క్రికెట్ అసోసియేషన్లు చాలా నష్టపోతాయన్న విషయం నాకు తెలుసు. కానీ వాటికి టీ20, వన్డేలను ఇవ్వాలి. టెస్టు క్రికెట్ కు వచ్చేసరికి మాత్రం ఎంపిక చేసిన ఐదు టెస్టు సెంటర్స్ లో ఆడిస్తే అక్కడి పరిస్థితులపై ఆటగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉండటమే గాక ఈ మ్యాచ్ లను చూసేందుకు జనం ఎగబడతారు..’అని చెప్పాడు.
తాజాగా ధర్మశాలలో జరగాల్సి ఉన్న మూడో టెస్టును ఇండోర్ కు మార్చిన నేపథ్యంలో విలేకరులు రోహిత్ శర్మను ఇదే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానం చెబుతూ... ‘మీరు టెస్టు క్రికెట్ ను ప్రమోట్ చేయాలంటే దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఆడాలి. దానిని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయొద్దు. అలా అయితే టెస్టు క్రికెట్ అందరికీ చేరదు..’అని చెప్పాడు.
ఇక ఈ చర్చ మరోసారి సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ మధ్య మంట రేపింది. టెస్టు సెంటర్స్ విషయంలో రోహిత్ చెప్పిందే నిజమని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వాపోతుంటే లేదు లేదు కోహ్లీ చెప్పిందే కరెక్ట్ అని అతడి అభిమానులు వాదిస్తున్నారు. ఇంగ్లాండ్ లో లార్డ్స్, ది ఓవల్, బర్మింగ్‌హామ్, ట్రెంట్ బ్రిడ్జి.. ఆస్ట్రేలియాలో అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ మాదిరిగా భారత్ లో కూడా ఐదారు టెస్ట్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలనే వాదన చాలాకాలంగా ఉంది. తద్వారా ఆ నగరాల బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు చాలాకాలంగా వాదిస్తున్నారు.
