Asianet News TeluguAsianet News Telugu

ఇరవై నిమిషాలు ముందు వెళ్లుంటే నేను కూడా వాళ్లతో పాటే.. ఆ దారుణ ఘటనను గుర్తు చేసుకున్న మురళీధరన్

Muttiah Muralitharan: ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఉగ్రరూపం దాల్చి లక్షలాది జీవితాలను పొట్టన పెట్టుకుని నేటికి సరిగ్గా 17 ఏండ్లు. ఆధునిక మానవ చరిత్రలో మాయని మచ్చగా మారిన ఘటనపై శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

If I set off 20 minutes earlier, I would also have been caught in the waves, Srilankan Legendary Spinner Muttiah Muralitharan recalls 2004 Tsunami
Author
Hyderabad, First Published Dec 26, 2021, 6:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆధునిక మానవ చరిత్రలో మనిషిపై ప్రకృతి పడగవిప్పిన దారుణ ఘటనకు నేటికి సరిగ్గా పదిహేడేండ్లు. ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఉగ్రరూపం దాల్చి.. 2004 డిసెంబర్ 26న ప్రశాంతంగా ఉన్న సముద్రం ఉవ్వెత్తున ఎగిసి లక్షలాది (సుమారు 2.30 లక్షలని ప్రాథమిక అంచనా) జీవితాలను పొట్టన పెట్టుకుంది. ముఖ్యంగా హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఉన్న భారత్ తో పాటు శ్రీలంక, ఇండోనేషియా, థాయ్లాండ్ వంటి  దేశాలను సునామీ అతలాకుతలం చేసింది. అయితే.. ఒక ఇరవై నిమిషాలు ముందు వెళ్లుంటే తాను కూడా  సునామీ దెబ్బకు బలైపోయేవాడినని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అంటున్నాడు. ఆ దారుణ ఘటన జరిగి 17 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఆయన అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. 

మురళీధరన్ మాట్లాడుతూ... ‘కలుతారా (శ్రీలంకలోని వెస్టర్న్ ప్రావిన్సులో సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఒక జిల్లా)  లోని   ఖుషిల్ గుణశేఖర ఫౌండేషన్ ఆఫ్ గుడ్ నెస్ ఏర్పాటు చేసిన ఓ చారిటీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నేను, నా కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యాను. దారి మధ్యలో మేము వెళ్తుండగా ఓ  చోట సముద్రం భూ ఉపరితలం పైకి రావడం మేము గమనించాము. అంతేగాక సముద్రంలోని నీళ్లు కూడా రంగు మారాయి. మాకేదో అనుమానం వచ్చింది. 

గాలె ఏరియాలో ఇలా కనిపించింది.  కార్లో ఉన్న మా కుటుంబ సభ్యులు నన్ను దిగొద్దని వారించారు. అక్కడ చాలా  మంది ప్రజలు  భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. దీంతో మేం  తిరిగి ప్రయాణమయ్యాం. ఇంటికి చేరుకుని టీవీ పెట్టి చూశాం. అప్పుడు నేను ఏం చూస్తున్నానో నాకు అర్థం కాలేదు. 

 

సముద్రం ఉప్పొంగి.. వేలాది మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ నేను ఇవన్నీ లెక్కచేయకుండా కలుతారాకు వెళ్లి ఉంటే.. నేనూ ఆ బాధితుల్లో ఒకడిగా ఉండేవాడిని. ఇదంతా 20 నిమిషాల వ్యవధిలోనే జరిగింది...’ అని   మురళీధరన్ చెప్పాడు. 

అంతేగాక.. ‘ప్రభుత్వ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం 2004 సునామీ కారణంగా శ్రీలంకలో 30 వేల మంది మరణించి ఉంటారని అంచనా వేసింది.  కానీ నా అంచనా మేరకు ఆ సంఖ్య లక్షకు పైనే ఉంటుందని అనిపించింది. సునామీ  తర్వాత నేను వివిధ ప్రదేశాలకు వెళ్లాను. మొత్తం ఊళ్లకే ఊళ్లు కొట్టుకుపోయాయి. ఆ బాధను మాటల్లో వర్ణించడం చాలా కష్టం...’ అని చెప్పుకొచ్చాడు. 

ఆ సమయంలో ప్రపంచ ఆహార సంస్థ తరఫున శ్రీలంకలో అంబాసిడర్ గా ఉన్న మురళీధరన్.. నిరుపేదలకు తన వంతు సాయమందించాడు. సునామీ కారణంగా శ్రీలంకలో సర్వం కోల్పోయినవారికి తినడానికి తిండి అందించడంలో ఎంతో కృషి చేశాడు మురళీధరన్.  

Follow Us:
Download App:
  • android
  • ios