ICC World cup 2023: వార్నర్, మార్ష్ బాదుడుతో ఆస్ట్రేలియా భారీ స్కోరు... 5 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిదీ...

తొలి వికెట్‌కి 259 పరుగుల రికార్డు భాగస్వామ్యం.. 121 పరుగులు చేసిన మిచెల్ మార్ష్..., 163 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. 

 

ICC World cup 2023:  David Warner, Mitchell marsh scores centuries, Shaheen Afridi picks fifer CRA

బ్యాటింగ్ ప్యారడైజ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్.. 42 ఓవర్లలో 325 పరుగులు దాటేసిన స్కోర్. ఆస్ట్రేలియా ఈజీగా 420+ చేస్తుందని అనుకున్నారంతా. అయితే మొదట్లో తేలిపోయిన పాకిస్తాన్ బౌలర్లు, డెత్ ఓవర్లలో కట్టుదిట్టడంగా బౌలింగ్ చేయడంతో ఆఖర్లో ఆస్ట్రేలియాకి ఆశించినన్ని పరుగులు రాలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 367 పరుగుల భారీ స్కోరు చేసింది. 

ఇన్నింగ్స్ మొదటి బంతికే డేవిడ్ వార్నర్ అవుట్ కోసం రివ్యూ కోరుకుంది పాకిస్తాన్.. అయితే రిప్లైలో బంతి, బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో రివ్యూ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని ఉసామా మిర్ జారవిడిచాడు.  

హారీస్ రౌఫ్ వేసిన మొదటి ఓవర్‌లో 4, 6, 1, 4, 4, 4 బాదిన ఆస్ట్రేలియా ఓపెనర్లు 24 పరుగులు రాబట్టారు.. ఆ తర్వాత ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్‌లోనూ 6, 1, 4, 4 రావడంతో 15 పరుగులు వచ్చేశాయి. 10 ఓవర్లు ముగిసే సమయయానికి వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 20 ఓవర్లు ముగిసే సమయానికి 149 పరుగులు చేసిన ఆసీస్, ఆ తర్వాత మరింత వేగం పెంచింది. డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు..

వన్డేల్లో డేవిడ్ వార్నర్‌కి ఇది 21వ సెంచరీ కాగా, పాకిస్తాన్‌పై వరుసగా నాలుగో వన్డే సెంచరీ. వన్డే వరల్డ్ కప్స్‌లో ఐదో సెంచరీ. వార్నర్ సెంచరీ చేసిన తర్వాతి బంతికే ఫోర్ బాది సెంచరీ అందుకుననాడు మిచెల్ మార్ష్. మిచెల్ మార్ష్‌కి ఇది రెండో వన్డే సెంచరీ కాగా నేడు అతని పుట్టిన రోజు కూడా కావడం విశేషం. పుట్టిన రోజున సెంచరీ చేసిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు మిచెల్ మార్ష్.. 

 తొలి వికెట్‌కి 259 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌ని అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాతి బంతికి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు..

స్టీవ్ స్మిత్ 7 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్, స్టోయినిస్ కలిసి నాలుగో వికెట్‌కి 41 పరుగులు జోడించారు. 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..

డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాక వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. జోష్ ఇంగ్లీష్ 3 ఫోర్లతో 13 పరుగులు చేసి అవుట్ కాగా మార్నస్ లబుషేన్ 8, మిచెల్ స్టార్క్ 2, మార్కస్ స్టోయినిస్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యారు..

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి స్టార్క్‌ని అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాతి బంతికి జోష్ హజల్‌వుడ్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆఖరి 5 ఓవర్లలో కేవలం 27 పరుగులు రాబట్టిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios