Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: బంగ్లాదేశ్‌‌కి రెండో విజయం... సెమీస్ రేసు నుంచి శ్రీలంక కూడా అవుట్..

Sri Lanka vs Bangladesh: ఆరు వరుస ఓటముల తర్వాత రెండో విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్... ఆరో ఓటమితో సెమీస్ రేసు నుంచి శ్రీలంక అవుట్.. 

ICC World cup 2023:  Bangladesh beats Sri Lanka, SL team out of Semi final race CRA
Author
First Published Nov 6, 2023, 10:00 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో శ్రీలంక కూడా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓడిన శ్రీలంక, టోర్నీలో ఆరో ఓటమి చవిచూసింది.. మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై గెలిచిన బంగ్లాదేశ్, ఆరు వరుస ఓటముల తర్వాత రెండో విజయాన్ని అందుకుంది. 

280 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లను త్వరగా కోల్పోయింది బంగ్లాదేశ్. తన్జీద్ హసన్ 9 పరుగులు, లిటన్ దాస్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే నజ్ముల్ హుస్సేన్ షాంటో, బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కలిసి మూడో వికెట్‌‌కి 169 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు..

65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్‌ని అవుట్ చేసిన ఏంజెలో మాథ్యూస్.. భారీ భాగస్వామ్యాన్ని బరేక్ చేశాడు. 101 బంతుల్లో 12 ఫోర్లతో 90 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో కూడా మాథ్యూస్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

10 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీమ్‌ని దిల్షాన్ మధుశంక క్లీన్ బౌల్డ్ చేయగా 22 పరుగులు చేసిన మహ్మద్దుల్లాని మహీశ్ తీక్షణ బౌల్డ్ చేశాడు. 210/2 స్కోరుతో ఈజీగా గెలిచేలా కనిపించిన బంగ్లాదేశ్, 255/6 స్థితికి చేరుకుంది..

అయితే రెండు సిక్సర్లు బాదిన తోహిద్ హృదయ్, మ్యాచ్‌లో డ్రామా లేకుండా చేశాడు. 3 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్‌ని తీక్షణ అవుట్ చేశాడు. తన్జీద్ హసన్ షేక్ 2 ఫోర్లతో 9 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించేశాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 49.3 ఓవర్లలో 279 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కుసాల్ పెరేరా 4 పరుగులు,  కెప్టెన్ కుసాల్ మెండిస్  19 పరుగులు, పథుమ్ నిశ్శంక   41 పరుగులు, సధీర సమరవిక్రమ  41 పరుగులు చేశారు.

ఏంజెలో మాథ్యూస్ వివాదాస్పద ‘టైమ్ అవుట్’గా పెవిలియన్ చేరాడు.  ధనంజయ డి సిల్వ 34 పరుగులు, మహీశ్ తీక్షణ  22 పరుగులు చేయగా చరిత్ అసలంక 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios