ICC World cup 2023: ఆస్ట్రేలియాకి రెండో విజయం, పాకిస్తాన్‌కి రెండో ఓటమి... ఓపెనర్లు అదరగొట్టినా..

Australia vs Pakistan: హాఫ్ సెంచరీలతో తొలి వికెట్‌కి 134 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన అబ్దుల్లా షెఫీక్, ఇమామ్ ఉల్ హక్... నిరాశపరిచిన బాబర్ ఆజమ్..

ICC World cup 2023: Australia beats Pakistan, Adam Zampa, Marcus Stoinis turns CRA

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని వరుసగా రెండు పరాజయాలతో మొదలెట్టిన ఆస్ట్రేలియా, వరుసగా రెండో విజయంతో గెలుపు దారిలోకి వచ్చేసింది. 368 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లు మంచి ఆరంభం అందించినా మిడిల్ ఆర్డర్‌, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో పాకిస్తాన్‌కి పరాజయం తప్పలేదు. 45.3 ఓవర్లలో 305 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్, 62 పరుగుల తేడాతో ఓడింది.

భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌కి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు ఓపెనర్లు. వరుసగా నాలుగు వైడ్లతో బౌలింగ్ మొదలెట్టాడు మిచెల్ స్టార్క్. 27 పరుగుల వద్ద అబ్దుల్లా షెఫీక్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకున్న సీన్ అబ్బాట్, బౌండరీ లైన్ మీద కాలు పెట్టడంతో సిక్సర్ వచ్చింది. ఆ తర్వాత ఇమామ్ ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ని ప్యాట్ కమ్మిన్స్ జారవిడిచాడు..

తొలి వికెట్‌కి 134 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అబ్దుల్లా షెఫీక్ అవుట్ అయ్యాడు. 61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, స్టోయినిస్ వేసిన మొదటి బంతికి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో రెండు ఫోర్లు బాది ఖాతా తెరిచాడు బాబర్ ఆజమ్..

71 బంతుల్లో 10 ఫోర్లతో 70 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ కూడా స్టోయినిస్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో కమ్మిన్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

సౌద్ షకీల్ 31 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 20 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుుగలు చేసిన ఇఫ్తికర్ అహ్మద్‌ని ఆడమ్ జంపా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.  40 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన మహమ్మద్ రిజ్వాన్ కూడా జంపా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.. 

రిజ్వాన్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ విజయానికి 55 బంతుల్లో 94 పరుగులు కావాలి. ఉసామా మీర్‌ని జోష్ హజల్‌వుడ్ అవుట్ చేయడంతో పాకిస్తాన్ ఓటమి ఖరారైపోయింది. ఆడమ్ జంపా ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన మహ్మద్ నవాజ్ స్టంపౌట్ అయ్యాడు. హసన్ ఆలీ, షాహీన్ ఆఫ్రిదీ కలిసి పాకిస్తాన్ స్కోరును 300+ మార్కు దాటంచారు.

8 పరుగులు చేసిన హసన్ ఆలీని అవుట్ చేసిన మిచెల్ స్టార్క్, ఆడిన ప్రతీ వరల్డ్ కప్ మ్యాచ్‌లో వికెట్ తీసిన రికార్డును కాపాడుకున్నాడు. 10 పరుగులు చేసిన షాహీన్ ఆఫ్రిదీ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 367 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ 121, డేవిడ్ వార్నర్ 163 పరుగులు చేసి  తొలి వికెట్‌కి 259 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, చివర్లో పెద్దగా పరుగులు చేయలేకపోయింది.  షాహీన్ ఆఫ్రిదీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios