ICC Womens T20 World Cup 2023: మహిళల ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్ తో మ్యాచ్ లో వరుణుడు   ఎంతకూ విడవకపోవడంతో మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోయింది. 

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వరుణుడు ఆ జట్టుకు షాకిచ్చాడు. భారత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్.. 8.2 ఓవర్లలో 54 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా భారత్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ ఈ టోర్నీలో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. లీగ్ దశలో భారత్.. పాకిస్తాన్, వెస్టిండీస్ లను ఓడించింది. ఇంగ్లాండ్ తో ఓడినా తర్వాత తిరిగి పుంజుకుని విజయాన్ని అందుకుంది. మరోవైపు ఈ టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా ఐర్లాండ్ నిరాశపరిచింది.

గ్రూప్ - బి నుంచి ఇంగ్లాండ్, ఇండియాలు సెమీస్ కు క్వాలిఫై అయ్యాయి. వెస్టిండీస్, పాకిస్తాన్, ఐర్లాండ్ లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్- ఎ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా తదుపరి స్థానం కోసం కివీస్, సౌతాఫ్రికా మధ్య పోటీ నెలకొని ఉంది.

మోస్తారు లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. రేణుకా సింగ్ ఠాకూర్ వేసిన తొలి ఓవర్లో మొదటి బంతికి అమీ హంటర్ కవర్ పాయింట్ దిశగా డ్రైవ్ చేసింది. తొలి పరుగు అవలీలగా తీసిన హంటర్ రెండో పరుగు తీసే యత్నంలో రనౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్ సూపర్ త్రో తో ఆమె రనౌట్ గా వెనుదిరిగింది. ఇదే ఓవర్లో ఐదో బంతికి రేణకా .. ప్రెండర్గస్ట్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.

ఆదుకున్న లూయిస్-లారా 

తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయిన ఐర్లాండ్ ను ఓపెనర్ లూయిస్, కెప్టెన్ లారా డీల్ని ఆదుకున్నారు. ఇద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. వస్త్రకార్ వేసిన నాలుగో ఓవర్లో లూయిస్, లారా లు తలా ఓ బౌండరీ బాదారు. దీప్తి శర్మ బౌలింగ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్.. రెండు వికెట్లకు 44 పరుగులు చేసింది.

వస్త్రకార్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ లో మూడో బంతిని వైడ్ గా విసిరింది. అప్పటికే కొద్దిసేపటి నుంచి వీస్తున్న ఈదురుగాలుల్లో ఉన్నఫళంగా వర్షం కూడా తోడైంది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అప్పటికి ఐర్లాండ్ స్కోరు.. 54 పరుగులు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐర్లాండ్.. విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచింది. 

Scroll to load tweet…

వర్షం ఎంతకీ ఆగకపోవడంతో నిర్వాహకులు మ్యాచ్ ను నిలిపేశారు. అంతకుముందు ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (87) తృటిలో సెంచరీ మిస్ అయింది. షఫాలీ వర్మ (24) ఫర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.