ICC Womens T20 World Cup 2023: భారత మహిళల క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ తన 150వ  టీ20 మ్యాచ్ లో అరుదైన ఘనతను  సొంతం చేసుకుంది. ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఆమె..  

టీమిండియా మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆమె ఏడు పరుగులు చేయగానే టీ20లలో 3వేల పరుగుల మైలురాయిని అందుకుంది. తద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా రికార్డు పుటల్లోకెక్కింది.

ఐర్లాండ్ తో మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కు టీ20లలో 150వ మ్యాచ్. ఇది ఓ రికార్డే. భారత్ తో పాటు అంతర్జాతీయ టీ20లలో ఇన్ని మ్యాచ్ లు ఆడిన తొలి మహిళ క్రికెటర్ కూడా ఆమెనే కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ లో షఫాలీ నిష్క్రమించిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కౌర్.. ఆరు పరుగులు చేయగానే టీ20లలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకుంది.

టీ20 క్రికెట్ లో భారత్ తరఫున 3 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచిన కౌర్.. మొత్తంగా ఈ జాబితాలో నాలుగో బ్యాటర్ గా ఉంది. ఆ జాబితాను ఓసారి చూస్తే.. 

టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్లు.. 

- సుజన్న విల్సన్ బేట్స్ (న్యూజిలాండ్) : 143 మ్యాచ్ లలో 3,820 రన్స్ 
- మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) : 130 మ్యాచ్ లలో 3,346 రన్స్ 
- ఎస్ఆర్ టేలర్ (వెస్టిండీస్) : 113 మ్యాచ్ లలో 3,346 రన్స్ 
- హర్మన్‌ప్రీత్ (ఇండియా) : 150 మ్యాచ్ లలో 3006 రన్స్ 
ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. 115 మ్యాచ్ లు ఆడి 2,800 పరుగులు చేసి ఆరో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు కివీస్ సారథి సోఫి డివైన్ 119 మ్యాచ్ లలో 2,969 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉంది. 

Scroll to load tweet…

భారత్ నుంచి అత్యధిక పరుగుల జాబితాలో హర్మన్‌ప్రీత్, మంధాన ల తర్వాత మిథాలీ రాజ్ (89 మ్యాచ్ లలో 2,364 రన్స్) తో మూడో స్థానంలో ఉంది. టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. 79 మ్యాచ్ లలో 1,661 పరుగులు చేసింది. 

కాగా టీ20లలో భారత క్రికెట్ (పురుషులు, స్త్రీలు) లో మూడు వేల పరుగులు సాధించిన క్రికెటర్లలో హర్మన్ మూడో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ (4008), రోహిత్ శర్మ (3,853) ల తర్వాత హర్మన్ ఉండటం గమనార్హం. 

ఇక ఐర్లాండ్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్మృతి మంధాన (87) విజృంభించడంతో భారత్ మోస్తారు లక్ష్యాన్ని ఐర్లాండ్ ముందు నిలిపింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత నిలుకడగా ఆడుతోంది.