India W vs Pakistan W : ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా పాక్ తో జరుగుతున్న మ్యాచులో మిథాలీ రాజ్ సేన గౌరవప్రదమైన స్కోరు చేసింది. అసలు రెండు వందలైనా దాటుతుందా..? అని ఆందోళన పడిన అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ...
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడుతున్న భారత్.. గౌరవప్రదమైన స్కోరు చేసింది. 114 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయిన దశలో భారత బ్యాటర్లు.. స్నేహ్ రాణా (53 నాటౌట్), పూజా వస్త్రకార్ (67) లు రాణించారు. ఇద్దరూ కలిసి భారత ఇన్నింగ్స్ ను నిర్మించడమే గాక ఆఖర్లో రెచ్చిపోయి ఆడారు. భారత టాపార్డర్ బ్యాటర్ స్మృతి మంధాన (52) హాఫ్ సెంచరీతో భారత ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచింది. దీంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక భారమంతా బౌలర్లదే. భారత్-పాకిస్థాన్ లలో ఏ జట్టు బోణీ చేస్తుందో చూడాలి మరి..
టాస్ గెలిచిన టీమిండియా సారథి మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్ కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ..డకౌట్ అయింది. డయానా బేగ్ వేసిన 3 ఓవర్లో బౌల్డ్ అయింది.
షఫాలీ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (40) తో కలిసి స్మృతి మంధాన (52) భారత ఇన్నింగ్స్ ను నడిపించింది. ఈ ఇద్దరూ కలిసి పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్నారు. మంధాన, షఫాలీలు కలిసి రెండో వికెట్ కు 92 పరుగులు జోడించారు. అయితే శతకం దిశగా సాగుతున్న ఈ భాగస్వామ్యాన్ని నష్ర సంధు విడదీసింది. దీప్తి శర్మను నష్రా బౌల్డ్ చేసింది. అప్పటికి భారత స్కోరు 96-2.
దీప్తి ఔట్ అయ్యాక మరో 3 ఓవర్లకే భారత్ కు మరో షాక్ తగిలింది. తన వన్డే కెరీర్ లో 25వ హాఫ్ సెంచరీ సాధించిన మంధాన.. 24.1 ఓవర్లో అనమ్ అమిన్ వేసిన బంతిని ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక ఆ తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (9), హర్మన్ప్రీత్ కౌర్ (5), వికెట్ కీపర్ రిచా ఘోష్ (5) లు వెంటవెంటనే నిష్క్రమించారు. దీంతో భారత్.. 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ ను స్నేహ్ రాణా, పూజాల జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ కలిసి ఏడో వికెట్ కు 132 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 48 బంతులు ఆడిన రాణా.. 4 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసింది. ఇక 59 బంతులు ఎదుర్కున్న పూజా.. 8 ఫోర్లతో 67 పరుగులు చేసింది. అసలు భారత్ స్కోరు రెండు వందలైనా దాటుతుందా..? అని ఆందోళన చెందిన అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ ఇద్దరూ అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఆఖరి ఓవర్లో పూజా ను ఫాతిమ సనా బోల్డ్ చేసింది.
పాక్ బౌలర్లలో నిద దర్, నష్రా సంధులు తలో రెండు వికెట్లు తీయగా.. డయానా బేగ్, అనమ్ అమిన్, ఫాతిమా సనా లకు చెరో వికెట్ దక్కింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. పాకిస్థాన్ విజయలక్ష్యం 245.
కాగా.. మహిళల క్రికెట్ లో ఇప్పటివరకు పాకిస్థాన్ పై భారత్ ఓడిపోలేదు. భారత్-పాక్ లు ఇప్పటిదాకా 10 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ పది సార్లు భారత్ నే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీలలో దక్కినవే. టీ20 ఫార్మాట్ లో రెండు జట్లు 11 మ్యాచులలో తలపడగా.. పాకిస్థాన్ ఒక్కసారే గెలిచింది.
