ICC Women's World Cup 2022: గత నెల రోజులుగా న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరుకున్నది. ఏప్రిల్ 3 (ఆదివారం) ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ లు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి.  

గడిచిన నెల రోజులుగా క్రికెట్ ప్రేమికులకు పురుషుల క్రికెట్ తో ఏ మాత్రం తీసిపోని మజాను పంచుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్-2022 తుది అంకానికి చేరుకున్నది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి పడుతూ లేస్తూ సెమీస్ చేరి ఆపై తనదైన ఆటతో ఫైనల్ కు చేరిన జట్టు ఒకటైతే.. మరోవైపు ఈ టోర్నీలో ఓటమనేదే లేకుండా వరుసగా ఎనిమిది విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న జట్టు మరొకటి. ఈ రెండు జట్లు ఆదివారం క్రిస్ట్ చర్చ్ లోని హగ్లే ఓవల్ లో టైటిల్ పోరుకు తలపడనున్నాయి. క్రికెట్ చరిత్రలో అత్యంత పురాతనమైన శత్రువులుగా ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లలో ఏ జట్టు పన్నెండో మహిళా వన్డే ప్రపంచకప్ ను ఎగురేసుకుపోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి మరి.. 

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న 2022 మహిళల ప్రపంచకప్.. గత నెల 4న మొదలైంది. ఈ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. తొలుత ఆసీస్ తో ఆ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. తర్వాత భారత్ తో ముగిసిన మ్యాచులో గెలుపొంది.. మళ్లీ విజయాల బాట పట్టింది. 

ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో న్యూజిలాండ్ ను కూడా ఓడించింది. ఇక పాకిస్థాన్ ను కూడా మట్టికరిపించి భారత్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడటంతో సెమీస్ కు చేరుకుంది. అయితే సెమీస్ వరకు గొప్ప ప్రదర్శనలేమీ చేయకున్నా సెమీఫైనల్లో మాత్రం సౌతాఫ్రికా పై దుమ్ముదులిపింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించి ఫైనల్ లో బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇదిలాఉండగా ఈ ట్రోపీలో ఆస్ట్రేలియాను ఓడించిన జట్టే లేదు. లీగ్ దశలో 7 మ్యాచులు గెలిచిన ఆసీస్.. సెమీస్ లో వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరింది. 

బలాబలాల విషయంలో ఇరు జట్లు సమానంగానే ఉన్నాయి. ఇంగ్లాండ్ తరఫున సెమీస్ లో డానియల్ వ్యాట్ సెంచరీతో చెలరేగింది. ఆ జట్టు సారథి నైట్ తో పాటు బీమోంట్, సోఫియా లు సందర్భోచితంగా ఆడుతున్నారు. బౌలింగ్ లో ఎకెల్స్టోన్ ఆ జట్టుకు పెద్ద బలం. ఇక ఆసీస్ కు సారథి మెగ్ లానింగ్ తో పాటు వెస్టిండీస్ తో సెమీస్ లో సెంచరీ చేసిన హీలి, బెత్ మూనీ, మెక్గ్రాత్ లు ఫామ్ లో ఉన్నారు. వీరితో పాటు ఆల్ రౌండర్ ఆష్లే గార్డ్నర్ ఉండనే ఉంది. బౌలింగ్ లో ఎల్లీస్ పెర్రీ తో పాటు డార్సీ బ్రౌన్, అలన కింగ్ లు మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నారు. 

Scroll to load tweet…

పన్నెండో ప్రపంచకప్ : 

ఇప్పటివరకు మహిళల క్రికెట్ లో పదకొండు ప్రపంచకప్ లు జరిగాయి. ఇందులో తొలి వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ (1973లో) గెలుచుకోగా తర్వాత వరుసగా 3 సార్లు ఆసీస్ గెలిచింది. మళ్లీ 1993లో ఇంగ్లాండ్ విశ్వవిజేత అయింది. 1997లో ఆసీస్, 2000లో న్యూజిలాండ్ ప్రపంచ విజేతగా నిలువగా.. 2005 లో మళ్లీ కంగారూలే దానిని సొంతం చేసుకున్నారు. 2009 లో ఇంగ్లాండ్, 2013లో ఆసీస్, 2017లో ఇంగ్లాండ్ విజయాలు సొంతం చేసుకున్నాయి. అంటే ఇప్పటివరకు 11 ప్రపంచకప్ లలో 6 సార్లు ఆసీస్.. 4 సార్లు ఇంగ్లాండ్ కప్ గెలవగా ఒకసారి న్యూజిలాండ్ విశ్వ విజేత అయింది. 

ముఖాముఖి: 

ఇప్పటివరకు ఈ రెండు జట్లు వన్డేలలో 152 మ్యాచులలో తలపడ్డాయి. వీటిలో 84 సార్లు ఆసీస్ గెలవగా 63 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది. 3 మ్యాచులలో ఫలితం రాలేదు. ఈ ట్రోఫీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచులో ఆసీస్ దే విజయం. 

ఎక్కడ జరుగుతుంది..? ఎప్పుడు..? 

హగ్లే ఓవల్ (క్రిస్ట్ చర్చ్) లో భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు... ఇదే ట్రోఫీలో భాగంగా ఇక్కడ ఇంగ్లాండ్ రెండు మ్యాచులాడి గెలిచింది. ఆసీస్ మాత్రం ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 

ఎలా చూడొచ్చు..? 

ఆసీస్-ఇంగ్లాండ్ మహిళల ప్రపంచకప్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్డీలతో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా వీక్షించొచ్చు.. 

జట్లు అంచనా :

ఆస్ట్రేలియా : అలిస్సా హీలి, మెగ్ లానింగ్ (కెప్టెన్), రాచెల్ హేన్స్, బెత్ మూనీ, తహిల మెక్గ్రాత్, ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సుదర్ల్యాండ్, జెస్ జొనాసెన్, అలన కింగ్, మెగన్, డార్సీ బ్రౌన్, ఎల్లీస్ పెర్రీ

ఇంగ్లాండ్ : హెతర్ నైట్ (కెప్టెన్), అమీ జోన్స్, టామీ బిమోంట్, డానియల్ వ్యాట్, సీవర్, సోఫియా డన్క్లీ, కతరీన్ బ్రంట్, సోఫి ఎకెల్స్టోన్, కేట్ క్రాస్, అన్య శ్రుభ్సోల్, నటాషా ఫరంట్, లారెన్ విన్ఫీల్డ్ హిల్