సిడ్నీ: ఐసిసి మహిళా టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులు రెండు కూడా గురువారం జరుగుతున్నాయి. మరి కాసేపట్లో తొలి సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఇంగ్లాండుతో తలపడనుంది. గ్రూప్ ఏ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు, గ్రూప్ బీ నుంచి దక్షిణాఫ్రికా ఇంగ్లాండు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి.

ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా ఇంగ్లాండుతో తలపడనుండగా, ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో పోటీ పడుతుంది. ఈ రెండు మ్యాచులు కూడా సిడ్నీ వేదికగా గురువారం జరుగుతన్నాయి. సిడ్నీలో వర్షాలు పడుతున్నాయి. ఈ స్థితిలో మ్యాచులు రద్దవుతాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Also Read: ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1... రికార్డు సృష్టించిన భారతీయ టీనేజర్ షెఫాలీ

ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన రెండు లీగ్ మ్యాచులు వర్షం వల్ల రద్దయ్యాయి. గురువారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో మ్యాచులో జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

ఒక వేళ వర్షం వల్ల సెమీ ఫైనల్ మ్యాచులు రద్దయితే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. రిజర్వ్ డే లేపోవడంతో ఈ ఆసక్తి నెలకొంది. మ్యాచ్ రద్దయితే గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్లు నేరుగా పైనల్ కు చేరుకుంటాయి. 

ఈ రకంగా చూస్తే గ్రూప్ ఏలో టాపర్ గా నిలిచిన టీమిండియా, గ్రూప్ బీలో టాపర్ దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరుకుంటాయి. అదే జరిగితే టీమిండియా, దక్షిణాఫ్రికా మార్చి 8వ తేదీన మెల్బోర్న్ వేదికగా పైనల్ మ్యాచులో పోటీ పడుతాయి. 

ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైన తర్వాత మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదని అంటున్నారు. అంతేకాకుండా అక్టోబర్ జరిగే పురుషుల టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ కు కూడా రిజర్వ్ డే లేదు.