T20 Worldcup2021: ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.
తాము ఆడిన తొలి మ్యాచ్ లో ఓడిన రెండు అగ్రశ్రేణి క్రికెట్ జట్లు ఇవాళ షార్జాలో కీలక పోరులో తలపడుతున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ (West Indies).. దక్షిణాఫ్రికా (South Africa)తో పోటీ పడుతున్నది. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లండ్ (Engalnd) చేతిలో చిత్తుగా ఓడింది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. విండీస్ తరఫున ఓపెనర్ ఎవిన్ లూయిస్ (Evin lewis) సిక్సర్ల మోత మోగించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. ఎవిన్ లూయిస్ (35 బంతుల్లో 56) వీరవిహారం చేయగా అతడికి మరో ఓపెనర్ లెండి సిమ్మన్స్ (16) సహకారమందించాడు. ఇన్నింగ్స్ తొలి మూడు ఓవర్లలో 6 పరుగులే చేసిన విండీస్.. ఆతర్వాత గేర్ మార్చింది. రబాడ వేసిన నాలుగో ఓవర్లో లూయిస్ ఫోర్, సిక్సర్ తో కలిపి 12 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో మార్క్రమ్ నూ లూయిస్ వదల్లేదు. ఆ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు ఫోర్ బాది 18 పరుగులు రాబట్టాడు. దీంతో 2 ఓవర్లలోనే విండీస్ కు 30 పరుగులు వచ్చాయి.
ఒకవైపు లూయిస్ విజృంభిస్తుంటే మరోవైపు సిమ్మన్స్ మాత్రం తన ఆటతో విసిగెత్తించాడు. అతడి బ్యాటింగ్ టెస్టు మ్యాచ్ ను తలపించింది. 35 బంతులాడిన అతడు 16 పరుగులే చేశాడు. ఈ క్రమంలో అతడు ఓ చెత్త రికార్డును సాధించాడు. టీ20 ప్రపంచకప్ లలో ఎక్కువ బంతులు ఆడి ఫోర్ కొట్టకుండా నిలిచిన ఆటగాళ్ల జాబితాలతో స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో అలోక్ కపాలి, మాట్ క్రాస్ ఉన్నారు.
ఇక తొమ్మిదో ఓవర్లో సిక్స్ కొట్టిన లూయిస్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మహారాజా (keshav Maharaj) వేసిన పదో ఓవర్లో భారీ షాట్ కు యత్నించి రబాడ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లూయిస్ సాధించిన 56 పరుగుల్లో.. 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అంటే.. 48 రన్స్ వీటి ద్వారా వచ్చినవే కావడం విశేషం.
లూయిస్ ఔటయ్యాక కూడా సిమ్మన్స్ జోరు పెంచలేదు. లూయిస్ నిష్క్రమణతో వచ్చిన పూరన్ (12).. స్పిన్నర్ షంషి బౌలింగ్ లో రెండు ఫోర్లు బాదాడు. కానీ తర్వాత మహారాజా మరోసారి విండీస్ ను దెబ్బకొట్టాడు. జోరు మీదున్న పూరన్ ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రబాడ.. సిమ్మన్స్ ను కూడా బౌల్డ్ చేశాడు.
అనంతరం వచ్చిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (12) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. 17 వ ఓవర్ వేసిన ప్రెటోరియస్ బౌలింగ్ లో కీపర్ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు విండీస్ సారథి కీరన్ పొలార్డ్ (kieron pollard (20 బంతుల్లో 26) రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించినా ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు.
ఆండ్రూ రస్సెల్ (5) క్రీజులోకి వస్తూనే ఫోర్ బాదినా అతడూ త్వరగానే ఔటయ్యాడు. ఐపీఎల్ లో మోత మోగించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ హెట్మెయర్ (1) రనౌట్ గా వెనుదిరిగాడు. ఆఖర్లో వచ్చిన బ్రావో.. 8 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో నార్జ్ పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన అతడు.. 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రబాడ, మార్క్రమ్ కూడా ఆకట్టుకున్నారు. కేశవ్ మహారాజ్ కు రెండు వికెట్లు దక్కాయి. టీ20 ప్రపంచకప్ లో తొలి విజయం సాధించాలంటే ఆ జట్టు 144 పరుగులు చేయాలి.
