Asianet News TeluguAsianet News Telugu

టి20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్: భారత్ తొలి టైటిల్ గెలిచేనా?

ప్రపంచ మహిళల క్రికెట్‌లో తొలిసారి 90,000 మంది ఓ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఈ అరుదైన, అద్భుత వేదికపై భారత్‌, ఆస్ట్రేలియాలు 2020 మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ కోసం అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. 

ICC T20 World cup Final match preview: Can Indian Women beat Australia?
Author
Melbourne VIC, First Published Mar 8, 2020, 10:17 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారత మహిళల జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. అత్యంత ఆసక్తిగా సాగనున్న ఈ సిరీస్ లో ఇప్పటివరకు అజేయంగా నిలిచిన భారత్... నాలుగుసార్లు టైటిల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. 

ప్రపంచ మహిళల క్రికెట్‌లో తొలిసారి 90,000 మంది ఓ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఈ అరుదైన, అద్భుత మెల్బోర్న్ వేదికపై భారత్‌, ఆస్ట్రేలియాలు 2020 మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ కోసం అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. 

గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్‌ అదే ఆత్మవిశ్వాసంతో నేడు మెగా ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌గా అడుగుపెడుతోంది. ప్రపంచకప్‌లు నెగ్గటం ఎలాగో తెలిసిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై టైటిల్‌ను నిలుపుకునేందుకు సర్వ శక్తులూ వడ్డనుంది. 

ఆత్మవిశ్వాసంతో భారత్.... 

భారత క్రికెట్‌ జట్టు ఎన్నడూ లేనంత గొప్పగా కనిపిస్తోంది. 16 ఏండ్ల షెఫాలి వర్మ భారత జట్టు స్వరూపాన్ని మార్చివేసింది. షెఫాలి వర్మను చూసి భయపడని బౌలర్లు లేరంటే అతిశయోక్తి కాదు. 

ఆదివారం ఫైనల్లో భారత్‌ కప్పును ఎగరేసుకుపోయేందుకు  సిద్ధమవుతోంది. అయినా, వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఒత్తిడిని ఎదుర్కొన్న అనుభవం ఈ జట్టుకు లేదు. సెమీఫైనల్స్‌ వర్షార్పణం కావటంతో వారం రోజులుగా హర్మన్‌ప్రీత్‌ బృందం మైదానంలో అడుగుపెట్టలేదు. 

ఈ గ్యాప్ లోనే ఆస్ట్రేలియా రెండు మ్యాచులు ఆడింది. ఒక రకంగా మైదానం తో మంచి టచ్ లో ఉన్నారు. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో షెఫాలి వర్మ విశిష్టత అందరికి తెలుసు. మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించవచ్చు కానీ ట్రోఫీలు జట్టుగానే నెగ్గగలం. 

ఈ విషయం హర్మన్‌ప్రీత్‌ సేనకు తెలుసు. అందుకే నేడు వర్మపైనే ఆధారపడితే సరిపోదు. స్టార్‌ బ్యాటర్లు స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగ్స్‌లు సైతం చెలరేగాలి. వరల్డ్‌కప్‌లో నిరాశపరిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. 

బర్త్‌ డే స్పెషల్‌ ఇన్నింగ్స్‌ కోసం కౌర్‌ సిద్ధమవ్వాలి. లోయర్‌ ఆర్డర్‌లో భారత్‌కు బిగ్‌ హిట్టర్లు లేరు. దీప్తి శర్మ, తానియా భాటియాలు భారీ షాట్లు ఆడలేరు. వేద కృష్ణమూర్తి బిగ్‌బాష్‌ లీగ్‌ అనుభవం ఉపయోగించుకోవాలి. 

బౌలింగ్‌ విభాగంలో భారత్‌కు ఎటువంటి బెంగ లేదు. ఆరంభ ఓవర్లలో వికెట్లు పడకపోయినా దిగులు పడాల్సి పని లేదు. భారత అసలు ఆయుధాలు పది ఓవర్ల తర్వాతనే ప్రయోగించనుంది. 

శిఖా పాండే ఆఖరు మ్యాచుల్లో మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఫైనల్లో స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌, రాధ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌లకు సహకారం అందిస్తే కప్పు అందుకోవటం సులువే.

అనుభవంతో కంగారూలు... 

వరల్డ్‌ నం.1 ర్యాంక్‌. సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలత. నాలుగు సార్లు కప్పు నెగ్గిన అనుభవం వెరసి నేడు ఫైనల్లో విజయంపై ఆస్ట్రేలియా దీమాగా కనిపిస్తోంది. మెగ్‌ లానింగ్‌ రూపంలో గొప్ప కెప్టెన్ కంగారూ జట్టుకు నాయకత్వం వహిస్తోంది. 58 సగటుతో పరుగులు పిండుకున్న లానింగ్‌ ఫైనల్లోనూ ప్రమాదకరం అనడంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. 

బెత్‌ మూనీ, అలిసా హేలీ పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడగలరు. బెత్‌ మూనీ దూకుడు తగ్గించినా, ఆమెతో ప్రమాదమే. నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించటంలో మూనీ దిట్ట. మిడిల్‌ ఆర్డర్‌లో లానింగ్‌, గార్డ్‌నర్‌లు ఫామ్‌లో ఉన్నారు. 

రేచల్‌ హేన్స్‌, జెస్‌ జొనాసెన్‌లు టచ్‌లో కనిపిస్తున్నారు. బెత్‌ మూనీ చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 81, 60, 28 పరుగులు చేసింది. గత ఏడాదిగా అత్యంత నిలకడగా అర్ధ సెంచరీలు సాధిస్తున్న బ్యాటర్‌ సైతం మూనీనే. 

ఫైనల్లో బెత్‌ మూనీ, అలిసా హీలే, యాష్లె గార్డ్‌నర్‌, మెగ్‌ లానింగ్‌లు ఆసీస్‌ బ్యాటింగ్‌ భారం మోయనున్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎలిసా పెర్రీ లేకపోవటం ఆస్ట్రేలియాకు పూడ్చలేని లోటు. 

భారత బ్యాటర్లపై పెర్రీకి గొప్ప రికార్డుంది. పెర్రీ బౌలింగ్‌పై భారత బ్యాటర్లు ఎదురుదాడి చేసేందుకు ఇష్టపడరు. పెర్రీ లేని బౌలింగ్‌ లైనప్‌ భారత్‌కు నల్లేరు మీద నడకే. మెగన్‌ షూట్, జెస్‌ జొనాసెన్‌, సోఫీలు పేస్‌ బాధ్యత తీసుకోనున్నారు. స్పిన్నర్‌ మోలి స్ట్రానో పవర్‌ ప్లేలో షెఫాలి వర్మకు సవాల్‌ విసిరే అవకాశం కనిపిస్తోంది. 

పిచ్‌, వెదర్ రిపోర్ట్ 

ఆదివారం మెల్‌బోర్న్‌ మెగా ఫైనల్స్‌కు వాతావరణం సహకరించనుంది. సిడ్నీ చిరుజల్లుల చేదు అనుభవం మెల్‌బోర్న్‌లో ఎదురయ్యే ప్రమాదం లేదు. తుది పోరు పిచ్‌ గట్టిగా, ఫ్లాట్‌గా కనిపిస్తోంది. భారత్‌ ఇక్కడ రెండు మ్యాచులు (న్యూజిలాండ్‌, శ్రీలంక) ఆడింది. ఒత్తిడితో కూడిన టైటిల్‌ పోరులో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం లేదు!. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఎక్కువ. 

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) 

భారత్‌ : షెఫాలి వర్మ, స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తానియా భాటియా, శిఖా పాండే, రాధ యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌. 

ఆస్ట్రేలియా : బెత్‌ మూనీ, అలిసా హీలే (వికెట్‌ కీపర్‌), మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), యాష్లె గార్డ్‌నర్‌, రేచల్‌ హేన్స్‌, జెస్‌ జొనాసెన్‌, నికోల్ కారి, డెలిసా కిమిన్సె, జార్జియా వారెహ్మ,/మోలి స్ట్రానో, సోఫి మోలినక్స్‌, మేగన్‌ షూట్

Follow Us:
Download App:
  • android
  • ios