Asianet News TeluguAsianet News Telugu

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ : భారత్ ఆశలన్నీ వీరిపైనే...!

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ఆదివారం మెల్‌బోర్న్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. నాలుగు సార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాకు అంతిమ పోరాటం కొత్త కాదు. టి 20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ కు చేరుకున్న టీమ్‌ ఇండియా యంగ్ ప్లేయర్స్ అండతో విజేతగా నిలవాలని చూస్తోంది. 

ICC t20 World cup Final: India banks heavily on shafali,smriti mandhana and poonam Yadav
Author
Hyderabad, First Published Mar 7, 2020, 6:47 PM IST

భారత అమ్మాయిలు తుదిపోరుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గెలుపుతప్ప ఓటమనేదే ఎరుగకుండా ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు దూసుకుపోతుంది. అదే రికార్డుతో ప్రపంచకప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ఆదివారం మెల్‌బోర్న్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. నాలుగు సార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాకు అంతిమ పోరాటం కొత్త కాదు. టి 20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ కు చేరుకున్న టీమ్‌ ఇండియా యంగ్ ప్లేయర్స్ అండతో విజేతగా నిలవాలని చూస్తోంది. 

2020లో భారత్‌, ఆస్ట్రేలియాలు ఇప్పటికే నాలుగుసార్లు టీ20ల్లో తలపడ్డాయి. 2-2 ముఖాముఖి రికార్డుతో ఫైనల్స్‌కు చేరుకున్నాయి. అగ్రజట్టు ఆసీస్‌ను సొంతగడ్డపైనే (2016) ఓడించి  మిథాలీరాజ్‌ నవ శకానికి నాంది పలికింది. 

ఇప్పుడు ఆసీస్‌ను వారి స్వదేశంలోనే ఓడించి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించేందుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం సిద్ధంగా ఉంది.  ఈ నేపథ్యంలో కీలకమైన ప్లేయర్స్ పై ఒక కన్నేద్దాం.   

మంధాన, షెఫాలి..ఓకే మరి మిడిల్ ఆర్డర్...?

ఇక బ్యాట్‌తో భారత్‌ భిన్నమైన వ్యూహం అమలు చేయాల్సి ఉంది. భారత్‌కు ఆసీస్‌ మాదిరి లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ లేదు. టాప్‌ ఆర్డర్‌లో షెఫాలి వర్మ, స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లు మాత్రమే బిగ్‌ హిట్లర్లు. 

మిడిల్‌ ఆర్డర్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫామ్‌లో లేకపోవటంతో.. బ్యాటింగ్‌ భారం అంతా టాప్‌ ఆర్డర్‌ మోయాల్సి వస్తోంది. ఆరంభంలో షెఫాలి వర్మ మెరుపులతో పవర్‌ప్లేలో భారత్‌ దండిగా పరుగులు రాబడుతోంది. 

ఆస్ట్రేలియాపై 46/2, బంగ్లాదేశ్‌పై 54/2, న్యూజిలాండ్‌పై 49/1, శ్రీలంకపై 49/1తో జోరు చూపించింది. టాప్‌ ఆర్డర్‌లో షెఫాలి వర్మ ఇన్నింగ్స్‌ భారత్‌కు అత్యంత కీలకం. మిడిల్‌ ఆర్డర్‌లో బిగ్‌ హిట్టర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫామ్‌లో లేదు. 

మెరుగ్గా రాణిస్తున్న దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తానియా భాటియాలు స్ట్రయిక్‌ రొటేషన్‌ కు మాత్రమే సరిపోతారు, కానీ బిగ్‌ హిట్టింగ్‌లో తేలిపోతారు. అందుకే తొలి పది ఓవర్లలో భారత్‌ భారీ స్కోరు చేసినా.. 20 ఓవర్ల తర్వాత ఓ మోస్తరు స్కోరుకు పరిమితం అవుతోంది. ఈ బలహీనతను దృష్టిలో ఉంచుకునే ఆరంభంలోనే షెఫాలి, మంధాన మరింత విజృంభించాల్సి ఉంటుంది.  

పూనమ్‌ మరోసారి తిప్పాల్సిందే... 

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో మాయలేడి పూనమ్‌ యాదవ్‌ భారత్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అని చెప్పక తప్పదు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పూనమ్‌ యాదవ్‌ను చాలా తెలివిగా ప్రయోగిస్తోంది. స్వల్ప స్కోర్లను కాపాడుకునే ప్రయత్నంలో పూనమ్‌ యాదవ్‌ను ఛేజింగ్ సెకండ్ హాఫ్ లో రంగంలోకి దింపుతోంది. 

ఆ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణం. ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారి పూనమ్‌ యాదవ్‌ వికెట్లు పడగొడుతోంది. పూనమ్ యాదవ్ నాలుగు ఓవర్ల స్పెల్‌ను ఆసీస్‌ కాచుకుంటే, కంగారూల ప్రయాణం సుఖవంతం అవుతుంది. 

గ్రూప్‌ దశలో ఆసీస్‌పై 10వ, బంగ్లాదేశ్‌పై 9వ, న్యూజిలాండ్‌పై 7వ, శ్రీలంకపై 7వ ఓవర్లో పూనమ్‌ యాదవ్‌ బౌలింగ్‌ చేసింది. ఫైనల్లో పూనమ్‌ యాదవ్‌ 10-20 ఓవర్ల మధ్యలో బౌలింగ్‌కు వస్తే ఛేదనలోనైనా, లక్ష్యం నిర్దేశించటంలోనైనా ఆస్ట్రేలియాకు కఠిన సవాల్‌ ఎదురవ్వటం ఖాయం.

Follow Us:
Download App:
  • android
  • ios