అనామక జట్లైనా తగ్గని ఉత్కంఠ.. యూఏఈపై చివరి బంతికి నెదర్లాండ్స్ థ్రిల్లింగ్ విక్టరీ..
ICC T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా క్వాలిఫై రౌండ్ లో భాగంగా యూఏఈ - నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా ముగిసిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ నే వరించింది.
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య లో స్కోరింగ్ థ్రిల్లర్లలో ఉండే మజానేవేరు. చేసింది తక్కువ పరుగులే అయినా ఆ స్కోరును కాపాడుకోవడానికి ఓ జట్టు, నెగ్గడానికి మరో జట్టు.. ఇలా ఇరు జట్లు నానా తంటాలు పడుతుండటం క్రికెట్ అభిమానులు చూసే ఉంటారు. టీ20 ప్రపంచకప్ తొలి రోజు కూడా అదే సీన్ రిపీట్ అయింది. క్వాలిఫై రౌండ్ లో భాగంగా యూఏఈ - నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా ముగిసిన ఈ మ్యాచ్ లో విజయం కోసం రెండు జట్లు చివరివరకూ పోరాడినా విజయం మాత్రం నెదర్లాండ్స్ నే వరించింది. యూఏఈ నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్.. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్ క్వాలిఫై రౌండ్ లో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న యూఏఈ -నెదర్లాండ్స్.. గీలాంగ్ వేదికగా మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బ్యాటింగ్ కు దిగింది. యూఏఈ ఓపెనర్లు చిరాగ్ సూరీ (12), మహ్మద్ వాసీం (47 బంతుల్లో 41, 1 ఫోర్, 2 సిక్సర్లు) తొలి వికెట్ కు 33 పరుగులు జోడించారు. వాసీం ఆకట్టుకున్నాడు.
కానీ వికెట్ల పతనం ప్రారంభమయ్యాక యూఏఈ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. ఖషిఫ్ దౌడ్ (15), వికెట్ కీపర్ అరవింద్ (18) లు విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఫరీద్ (20 రనౌట్ అయ్యాడు. బాసిల్ హమీద్ (4), కెప్టెన్ రిజ్వాన్ (1) లు కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. ఫలితంగా యూఏఈ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బస్ డి లీడ్ 3 వికెట్లు తీయగా.. ఫ్రెండ్ క్లాసెన్ రెండు, టిమ్ ప్రింగిల్ ఓ వికెట్ పడగొట్టాడు.
స్వల్ప లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ కు రెండో ఓవర్లోనే షాక్ తాకింది. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (10) జట్టు స్కోరు 14 వద్దే ఔటయ్యాడు. మరో ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (23) ఫర్వాలేదనిపించాడు. అతడిని జునైద్ సిద్ధిఖీ బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన బస్ డీ లీడ్ (14), కొలిన్ (17) నెమ్మదిగా ఆడి నిష్క్రమించారు. పది ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్స్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 62గా ఉండగా వరుసగా వికెట్లు కోల్పోవడంతో.. 14 ఓవర్లు అయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయింది.
చివరి నాలుగు ఓవర్లలో 26 పరుగులు కావాల్సి ఉండగా.. 17వ ఓవర్లో 7 పరుగులు రాగా సిద్దిఖీ వేసిన 18వ ఓవర్లో 9 పరుగులొచ్చాయి. 19వ ఓవర్ జహూర్ ఖాన్ వేయగా.. ఆ ఓవర్లో టిమ్ ఫ్రింగిల్(15) బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. జవార్ ఫరీద్ తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు. కానీ నాలుగో బంతికి రెండు పరుగులొచ్చాయి. ఐదో బంతికి కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ (19 బంతుల్లో 16 నాటౌట్) సింగిల్ తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.