Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: మాకే చెమటలు పట్టించారు.. బాగా ఆడారు.. నమీబియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ఓదార్చిన పాక్ ఆటగాళ్లు

Pakistan vs Namibia: మ్యాచ్ ముగిశాక నమీబియా డ్రెస్సింగ్ రూమ్ కు  అనుకోని అతిథులు వచ్చారు. వారిని చూసిన నమీబియా ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యపోయారు.  డోర్ తీసుకుని లోపలికి వచ్చిన వారిలో పాకిస్థాన్ సెలక్షన్ మేనేజర్ తో పాటు.. ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ICC T20 World cup 2021: Pakistan Team visits Namibia dressing room and congratulate them for their journey, Twitter reacts
Author
Hyderabad, First Published Nov 3, 2021, 12:36 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో భాగంగా గ్రూప్-2లో మంగళవారం పాకిస్థాన్-నమీబియా (Pakistan vs Namibia) మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి సెమీఫైనల్స్ కు  చేరింది.  తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత ఓవర్లలో ఓపెనర్లిద్ధరు కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam), మహ్మద్ రిజ్వాన్ (mohammad Rizwan) లు వీరవిహారం చేయడంతో 189 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత నమీబియాను 144 పరుగులకే కట్టడి చేసి 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం  పలువురు పాక్ ఆటగాళ్లు.. నమీబియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి వారిని ఓదార్చారు. 

మ్యాచ్ ముగిశాక నమీబియా డ్రెస్సింగ్ రూమ్ కు  అనుకోని అతిథులు వచ్చారు. వారిని చూసిన నమీబియా ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యపోయారు.  డోర్ తీసుకుని లోపలికి వచ్చిన వారిలో పాకిస్థాన్ సెలక్షన్ మేనేజర్ తో పాటు.. ఆ జట్టు ఆటగాళ్లు మహ్మద్ హఫీజ్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, ఫఖర్ జమాన్ లు ఉన్నారు. వీళ్లంతా నమీబియా ఆటగాళ్ల దగ్గరికెళ్లి మనసారా హత్తుకుని వారిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఓడిపోయినందుకు బాధపడొద్దని, ఈ మ్యాచ్ లో చాలా బాగా ఆడారని.. నమీబియాకు మంచి భవిష్యత్తు ఉన్నదని పాక్ సెలక్షన్ మేనేజర్ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ఓడిపోయామని బాధపడొద్దు. మీరు చాలా బాగా ఆడారు. మాకు పోటీగా పరుగులు సాధిస్తూ కొంచెంసేపు మమ్మల్ని ఆందోళనకు గురి చేశారు. మ్యాచ్ లో గెలుపు ఓటములు సహజం. కానీ ఈ మ్యాచ్ లో డేవిడ్ వీస్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండుపోతుంది’ అని చెప్పాడు. 

 

అనంతరం పాక్ ఆటగాళ్లు.. నమీబియా క్రికెటర్లను హత్తుకుని వారిని అభినందించారు. కాసేపు అక్కడే ఉన్న పాక్ క్రికెటర్లు.. నమీబియా ఆటగాళ్లతో కలిసిపోయారు. అందరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. పాక్ యువ బౌలర్ షాహిన్ అఫ్రిది.. నమీబియా ఆల్ రౌండర్ డేవిడ్ వీస్ ను హగ్  చేసుకున్నాడు.

 

కాగా ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ- PCB) ట్విట్టర్ లో పోస్టు చేసిన వెంటనే ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోను జతపరుస్తూ..  ‘పాక్ జట్టు నమీబియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి వారి  టీ20 ప్రపంచకప్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపింది’ అని పోస్ట్ చేసింది.  దీనికి పలువురు క్రికెట్ అభిమానులు.. పాక్ జట్టు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని కామెంట్ చేశారు.  ‘ఓడిన జట్టును బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పడం ధర్మం.. ఈ రోజు పాకిస్థాన్ అదే చేసి చూపించింది’ అంటూ కామెంట్స్ పెట్టారు. 

 

 

నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ కు తొలి నాలుగు ఓవర్లలో నమీబియా బౌలర్లు చుక్కలు చూపించారు. నాలుగు ఓవర్లలో ఒక ఓవర్ మేయిడిన్ కాగా.. తర్వాత ఓవర్లలో కూడా పది పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ పవర్ ప్లే అనంతరం పాక్ బ్యాటర్లు విజృంభించడంతో పాక్ భారీ స్కోరు చేసింది. ఇక  లక్ష్య ఛేదనలో నమీబియా బాగానే పోరాడింది. ఆ జట్టు బ్యాటర్లు క్రెయిగ్ విలియమ్స్, బార్ట్, డేవిడ్ వీస్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా వీస్ అయితే.. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios