Australia Vs New Zealand: ఆసీస్-కివీస్ మధ్య జరిగే టీ20 వరల్డ్ కప్ తుది పోరులో విజేతను  అంచనా వేయడం కష్టమే అయినా పలువురు మాజీ క్రికెటర్లు రెండు జట్ల బలాలను బట్టి ఎవరు గెలుస్తారో చెబుతున్నారు. అయితే కెవిన్ పీటర్సన్ ప్రెడిక్షన్ పై మాత్రం ఆసీస్ అభిమానులు ఆందోళనగా ఉన్నారు. 

టీ20 ప్రపంచకప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారి పొట్టి ప్రపంచకప్ లో కొత్త ప్రపంచకప్ ను చూడబోతున్నాం. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు జరుగనున్నది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ పోరులో విజేతను అంచనా వేయడం కష్టమే అయినా పలువురు మాజీ క్రికెటర్లు ఇరు జట్ల బలాబలాలను బట్టి ఎవరు గెలిచే అవకాశముందో చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా తన అభిప్రాయం ప్రకారం రేపటి పోరులో విజేత ఎవరో చెప్పేశాడు. ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం కంగారూలదే అని పీటర్సన్ అంచనా వేశాడు.

ఇదే విషయమై పీటర్సన్ తన బ్లాగ్ లో మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో న్యూజిలాండ్ బలంగా ఉంది. కానీ ఆస్ట్రేలియానే నా ఫేవరెట్. ఐసీసీ టోర్నీలలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు విజయం ఆసీస్ నే వరించిందని చరిత్ర చెబుతున్నది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ ను ఓడించింది’ అని అన్నాడు.

అంతేగాక ఏదైనా టోర్నీలో తుది పోరుకు చేరితే ఆసీస్ బలంగా తయారవుతుందని, దానిని నిలువరించడం చాలా కష్టమని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ‘ఫైనల్ కు చేరితే ఆసీస్ చాలా బలంగా తయారవుతుంది. అది ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిగా మారుతోంది. ఈ ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా చేజిక్కించుకోవడంలో సందేహమే లేదు. డూ ఆర్ డై మ్యాచ్ లలో ఆ జట్టు బలం మరింత పెరుగుతుంది. తుది పోరులో ఆ జట్టులోని ఆటగాళ్లంతా తమ సామర్థ్యాన్ని బయటకు తీస్తారు. అందుకే చాలా కాలంగా వాళ్లు టెస్టు క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ ను ఏలారు. ఇక టీ20 వరల్డ్ కప్ గెలిస్తే కూడా వాళ్లు (ఆసీస్) తమ బలాన్ని చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని తెలిపాడు. 

కీలక టోర్నీలో డేవిడ్ వార్నర్ ఫామ్ లోకి రావడం ఆసీస్ కు లాభించిందని పీటర్సన్ అన్నాడు. ‘ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ ఈ సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచిన వార్నర్.. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం ఇరగదీస్తున్నాడు. అతడికి తోడు పాకిస్థాన్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ లో స్టాయినిస్, వేడ్ అద్భుతం చేశార’ని పీటర్సన్ చెప్పాడు. 

Scroll to load tweet…

అయితే పీటర్సన్ అంచనాలు కొంచెం తేడాగా ఉంటాయని ట్విట్టర్ లో నెటిజనులు వాపోతున్నారు. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ తో సెమీస్ కు ముందు కూడా పీటర్సన్ అంచనా అట్టర్ ప్లాఫ్ అయింది. ఈ టోర్నీలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తప్ప మరే జట్టూ తమను ఓడించలేదని అతడు చేసిన ట్వీట్.. రెండ్రోజుల క్రితం వైరలైంది. సెమీస్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా పీటర్సన్.. ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతుందని ప్రిడిక్ట్ చేశాడు. కానీ టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఇంగ్లాండ్ సెమీస్ లో ఇంటి బాట పట్టింది.

Scroll to load tweet…

ఇక ఇప్పుడు కూడా ఇదే తరహా లో జరుగుతుందని ఆసీస్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. పీటర్సన్.. ఆసీస్ ను ఫేవరెట్ అన్నాడంటే ఇక విజయం మాదేనని కివీస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మరి పీటర్సన్ అంచనాలు నిజమవుతాయో.. లేక ఆసీస్ అభిమానుల ఆశలు అడియాసలవుతాయో తెలియాలంటే రేపటిదాకా వేచి చూడాల్సిందే.