మరో క్రికెట్ సంగ్రామానికి తెరలేచింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఈ ప్రపంచకప్‌ జరగనుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగా టోర్నమెంట్‌లో తలపడతాయి.

పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి పసికూనలు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో చిన్న జట్లు ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి షెడ్యూల్‌ను వినూత్నంగా రూపొందించింది.

పసికూనలను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విడదీసి.. అందులో రెండు పెద్ద జట్లను వేసింది. గ్రూప్‌-ఏలో శ్రీలంక, పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూప్-బీలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. 

ఇక సూపర్‌-12 దశలో జట్లను గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు. గ్రూప్-1లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్.. గ్రూప్‌-2లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి.

గ్రూప్-ఏలో తొలిస్థానం సాధించిన జట్టు, గ్రూప్-బిలో రెండోస్థానంలోని జట్టు సూపర్-12లో గ్రూప్-1లో చేరతాయి. అలాగే గ్రూప్-బిలో అగ్రస్థానం సాధించిన జట్టు, గ్రూప్-ఏలో రెండో జట్టు సూపర్‌-12లో గ్రూప్-2లోకి చేరతాయి. 

ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ శ్రీలంక-ఐర్లాండ్ మధ్య అక్టోబర్ 18న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా నవంబర్ 15న జరగనుంది. ఇక భారత్ విషయానికి వస్తే సూపర్‌-12లో టీమిండియా ఐదు మ్యాచ్‌ల్లో తలపడుతుంది. 

టీమిండియా షెడ్యూల్:

* 24.10.2020 భారత్-దక్షిఫణాఫ్రికా
* 29.10.2020 భారత్ -క్వాలిఫైయర్ జట్టు
* 01.11.2020 భారత్- ఇంగ్లాండ్
* 05.11.2020 భారత్- క్వాలిఫైయర్ జట్టు
* 08.11.2020 భారత్-ఆఫ్గానిస్తాన్