Pakistan Cricket: ఆసియాకప్ వివాదం  మరోసారి తెరమీదకు వచ్చింది.  పాకిస్తాన్ లో  ఈ టోర్నీని నిర్వహిస్తే తాము అక్కడకు వెళ్లబోమని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా  పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. 

భారత్ - పాకిస్తాన్ ల మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రపంచంలో అత్యంత సంపన్న బోర్డుగా ఉన్న బీసీసీఐ కనుసన్నల్లో ఐసీసీ ఉండటం వల్లే పాకిస్తాన్ ఏమీ చేయలేకపోతుందని, ఇండియా ఏ షరతులు విధించినా వాటికి వంత పాడాల్సి వస్తుందని పాక్ మాజీ స్పిన్నర్ అబ్దుర్ రెహ్మాన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఐసీసీలో ఉండేవారందరూ ఇండియా కోసం పనిచేస్తారని రెహ్మాన్ అన్నాడు. 

పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ యూట్యూబర్ నాదిర్ అలీ పాడ్‌కాస్ట్ షో కు వచ్చిన అబ్దుర్ రెహ్మాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. నాదిల్ అలీ.. ‘ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్ కు రానంటుంది..? భారత్ మ్యాచ్ లను యూఏఈలో ఆడించాలని వార్తలు వస్తున్నాయి. ఇది సరైనదేనా..?’అని అడిగాడు. 

దీనికి రెహ్మాన్ సమాధానమిస్తూ.. ‘లేదు. ఇలా జరుగకూడదు..’అని బదులిచ్చాడు. అప్పుడు నాదిర్ ‘ఎందుకు..?’అని ప్రశ్నించగా రెహ్మాన్.. ‘ఎందుకంటే ఐసీసీ ఇండియా కంట్రోల్ లో ఉంది..’అని చెప్పాడు.

రెహ్మాన్ చెప్పినదానితో ఏకీభవిస్తూ నాదిర్.. ఐసీసీని ‘ఇండియా క్రికెట్ కౌన్సిల్ అనొచ్చా.?’అని అడిగాడు. దానికి రెహ్మాన్ స్పందిస్తూ..‘కచ్చితంగా. ఐసీసీలో పనిచేస్తున్నవారందరూ ఇండియా వాళ్లే. అంతేగాక ఐసీసీకి 60 నుంచి 70 శాతం నిధులు ఇండియా నుంచే అందుతున్నాయి. అందుకే బీసీసీఐ చెప్పినదానికి మనం(పాకిస్తాన్) సరే అనాల్సి వస్తుంది. అంతేగానీ మనం నో చెప్పడానికి లేదు. ఏదేమైనా మనం దుబాయ్ లో చాలా క్రికెట్ ఆడాం. ఆసియా కప్ ఆడేందుకు ఇండియా ఇక్కడకు రాకుంటే ఫర్వాలేదు. కానీ మనం వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు మాత్రం అక్కడికి వెళ్తాం. ఎందుకంటే మనం క్రికెట్ ఆడాల్సి ఉంది...’అని వ్యాఖ్యానించాడు. 

కాగా ఆసియా కప్ నిర్వహణ వివాదం మార్చిలో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 4న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహణ అంశం లేవనెత్తాడు. దీనికి ఏసీసీ అధ్యక్షుడి హోదాలో హాజరైన జై షాతో పాటు బీసీసీఐ కూడా భారత్ మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించాలని అలా అయితేనే ఆసియా కప్ ఆడతామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి మార్చిలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం.