INDvsAUS: భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడు రోజుల్లోపే ముగిసిన  ఇండోర్ టెస్టులో పిచ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఈ పిచ్ పై ఐసీసీ కూడా స్పందించింది. 

అనుకున్నదే అయింది. ఏడు సెషన్లలోనే ముగిసిన ఇండోర్ పిచ్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండోర్ పిచ్ బ్యాట్, బంతికి సమతూకం కలిగించే విధంగా లేదని.. ఈ పిచ్ కు ‘పూర్’ రేటింగ్ ఇచ్చింది. తొలి రోజు ఉదయం ఆట నుంచే బంతి మితిమీరి టర్న్ అయిన ఈ పిచ్ వల్ల టెస్టు క్రికెట్ ను అపహస్యం చేస్తున్నారని స్వయంగా భారత మాజీ క్రికెటర్లే వాపోయిన వేళ ఐసీసీ ఇచ్చిన రేటింగ్ కు బీసీసీఐ కి షాక్ తగిలింది. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా నిర్వహించిన మూడో టెస్టుకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ‘పూర్’ రేటింగ్ ఇచ్చాడు. ఇదే విషయమై ఐసీసీ కూడా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

ఇరు జట్ల సారథులను కలిసిన తర్వాత బ్రాడ్ వారి అభిప్రాయాలతో పాటు మ్యాచ్ నిర్వాహకులను కలిసి వారితోనూ మాట్లాడి ఈ రేటింగ్ అందజేశాడు. సాధారణంగా ‘యావరేజ్’ పిచ్ రేటింగ్ లతో వచ్చే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఐసీసీ తాజాగా ఇండోర్ కు పూర్ రేటింగ్ ఇవ్వడంతో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా దక్కాయి. ఈ పిచ్ లో మూడు రోజుల పాటు అసలు టెస్టు మ్యాచ్ ప్రమాణాలకు సరిపడా స్పందించేలా రూపొందించలేదని తెలిపింది.

కాగా బీసీసీఐ ఈ నిర్ణయంపై సవాల్ చేయడానికి 14 రోజుల సమయం కూడా ఇచ్చింది. బీసీసీఐ చెప్పే సమాధానంతో ఐసీసీ అంగీకరిస్తే అప్పుడు డీమెరిట్ పాయింట్లు వెనక్కి తీసుకునే అవకాశముంటుంది. 

ఇదే విషయమై బ్రాడ్... ‘పిచ్ చాలా డ్రై గా ఉంది. ఈ పిచ్ లో ఒక్క సెషన్ కూడా బంతికి బ్యాట్ కు సమతూకంగా బ్యాలెన్స్ కనిపించలేదు. మొత్తం స్పిన్నర్లకే అనుకూలించేలా ఉంది. మ్యాచ్ లో ఐదో బంతికే పిచ్ ఉపరితలం దెబ్బతింది. ఆ తర్వాత నిరాటంకంగా కొనసాగింది. సీమర్లకు ఏమాత్రం అనుకూలంగా లేదు..’అని తన నివేదికలో పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

ఇండోర్ టెస్టులో తొలి రెండు సెషన్లలోనే భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 109 పరుగులకే చాప చుట్టేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా మూడో సెషన్ ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఉదయం ఆటలో ఆసీస్ 11 పరుగుల తేడాతో ఆరు వికెట్లు కోల్పోగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెండు సెషన్ల పూర్తి ఆట ఆడలేకపోయింది. ఆస్ట్రేలియా ముందు భారత్ నిర్దేశించిన 76 పరుగుల విజయలక్ష్యాన్ని ఆ జట్టు.. మూడో రోజు ఉదయం సెషన్ లో 18.5 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని అందుకుంది.