World Cup 2023 Final : క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌షో !
India vs Australia: నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్‌కు ముందు గ్రాండ్ ముగింపు వేడుక జరగనుంది. దీనిలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఎయిర్‌షో కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.
ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించి.. గ్రాండ్ విక్టరీతో ఫైనల్ కు చేరుకుంది. అలాగే, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ గెలుపుతో ఫైనల్ కు వచ్చింది. ఈ మెగా టోర్నీ చివరిదశకు చేరుకుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్ ఫైనల్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న పలు రిపోర్టుల ప్రకారం.. ప్రపంచ కప్ ముగింపు వేడుక సందర్భంగా భారత వైమానిక దళం ఎయిర్ షోను కూడా నిర్వహిస్తుంది.
బుధవారం ముంబయి వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ప్రపంచకప్ టోర్నీలో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఎయిర్ షో జరిగే అవకాశం బలంగా ఉంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌ను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. భారత్ ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. జట్టు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకోగా, పెద్ద సంఖ్యలో జనాలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు.
ముంబయిలోని వాంఖడే స్టేడియాలో జరిగిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయంతో భారత్ అజేయంగా టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ప్రపంచకప్‌కు ఎలాంటి ప్రారంభోత్సవం జరగలేదు. అయితే ఆతిథ్య భారత్ కూడా ఫైనల్‌కు చేరడంతో ఫైనల్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటికే నాలుగు నెట్ విమానాలు ఫ్లైట్ రిహార్సల్స్ ప్రారంభించాయి. ఇది ఎయిర్‌షో కోసం ప్రాక్టీస్ అని సమాచారం. ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు ఎయిర్ షో నిర్వహించేందుకు స్థానిక యంత్రాంగం అనుమతి కూడా కోరింది. ఐఏఎఫ్ వైపు నుండి ఎయిర్ షో కాకుండా, ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా స్టేడియానికి రానున్నారు.
కాగా, ప్రపంచకప్‌లో ప్రత్యక్ష ప్రసార ఛానెల్ అయిన స్టార్ స్పోర్ట్స్ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్ కోసం అహ్మదాబాద్ నుంచి ఉదయం 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా స్టార్ స్పోర్ట్స్ కూడా వెల్లడించింది. సాధారణంగా, ప్రపంచ కప్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది, అయితే స్టార్ స్పోర్ట్స్ దాని ప్రత్యక్ష ప్రసారాన్ని మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభిస్తుంది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి 7 గంటల ముందు నుంచే లైవ్ కవరేజీ ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది.