అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్... నవంబర్ 11న బెంగళూరులో జరగాల్సిన ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్‌, నవంబర్ 12కి వాయిదా.. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపై నవ రాత్రుల ప్రభావం పడింది. ఐసీసీ ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సింది. అయితే అదే రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అదే రోజు అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌‌కి భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమైపోతుందని పోలీసు శాఖ విన్నవించింది.

దీంతో నవరాత్రుల్లో మొదటి రోజు జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక్క రోజు ముందుగానే జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ ఖరారు చేసింది. ఈ మ్యాచ్ కారణంగా మిగిలిన మ్యాచుల షెడ్యూల్‌లో కూడా మార్పులు జరిగాయి..

అక్టోబర్ 14 శనివారం ఢిల్లీలో జరగాల్సిన ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, అక్టోబర్ 15న ఆదివారం జరుగుతుంది. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12 గురువారం రోజున హైదరాబాద్‌లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ని అక్టోబర్ 10 మంగళవారానికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ..

అక్టోబర్ 13 శుక్రవారం, లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌... గురువారం, అక్టోబర్ 12న జరుగుతుంది. అక్టోబర్ 14న చెన్నైలో జరగాల్సిన న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్, అక్టోబర్ 13న జరుగుతుంది. అలాగే అక్టోబర్ 10న ధర్మశాలలో జరగాల్సిన ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ డే నైట్ మ్యాచ్‌గా కాకుండా డే మ్యాచ్‌గా ఉదయం 10:30 గంటలకు మొదలవుతుంది..

నవంబర్ 12న జరగాల్సిన డబుల్ హెడర్ మ్యాచులు, ఒక్క రోజు ముందు నవంబర్ 11న జరుగుతాయి. నవంబర్ 11న ఉదయం 10:30కి పూణేలో ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కత్తాలో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది..

నవంబర్ 11న బెంగళూరులో జరగాల్సిన ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్‌ని నవంబర్ 12న నిర్వహిస్తారు. మిగిలిన అన్ని మ్యాచులు యాథావిథిగా ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. 

భారత స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ టికెట్ల ఆన్‌లైన్‌లో విక్రయానికి అందుబాటులోకి వస్తాయి. వార్మప్ మ్యాచులకు కూడా టికెట్లు అమ్మకానికి పెడుతోంది ఐసీసీ. గౌహతి, త్రివేండ్రంలో ఇండియా ఆడే మ్యాచుల టికెట్లు ఆగస్టు 30 నుంచి, చెన్నై, ఢిల్లీ, పూణే నగరాల్లో ఇండియా ఆడే మ్యాచుల టికెట్లు ఆగస్టు 31 నుంచి అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి..

ధర్మశాళ, లక్నో, ముంబైల్లో టీమిండియా ఆడే మ్యాచుల టికెట్లు సెప్టెంబర్ 1 నుంచి, బెంగళూరు, కోల్‌కత్తాల్లో భారత జట్టు ఆడే మ్యాచుల టికెట్లు సెప్టెంబర్ 2 నుంచి అమ్మకానికి వస్తాయి. అహ్మదాబాద్‌లో ఇండియా ఆడే మ్యాచుల టికెట్లు సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇతర దేశాల వార్మప్ మ్యాచులు, ఇండియా ఆడని వరల్డ్ కప్ మ్యాచుల టికెట్లు మాత్రం ఆగస్టు 25 నుంచి విక్రయిస్తారు. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచుల టికెట్లు సెప్టెంబర్ 15 నుంచి విక్రయించబోతున్నట్టు ఐసీసీ ప్రకటించింది.