ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సూపర్‌ఓవర్ ఇంకా జ్ఞాపకాల్లో కదలాడుతూనే ఉంది. ఇద్దరి స్కోరు ఒక్కటే కావడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’’ ఆడించారు.

ఇది కూడా టై అవ్వడం బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించడం క్రికెట్ ప్రేమికులను నిరాశకు గురిచేసింది. దీనితో పాటు ఐసీసీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం చేశారు.

దీంతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి సూపర్‌ఓవర్‌పై ఫోకస్ పెట్టింది. ఇక నుంచి ప్రపంచకప్ సెమీస్, ఫైనల్లో సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించబోమని ఐసీసీ స్పష్టం చేసింది.

విజేత ఎవరో ఖచ్చితంగా తేలేవరకు ఎన్నయినా సూపర్‌ఓవర్లు ఆడిస్తామని అనిల్  కుంబ్లే సారథ్యంలోని సిఫార్సుల కమిటీ ప్రకటించింది.

అంతేకాకుండా కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్‌ఓవర్లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. కానీ.. ఆ సూపర్ ఓవర్ టై అయితే మ్యాచ్‌ను టై గానే ప్రకటిస్తారు తప్పించి మరో సూపర్‌ఓవర్ ఉండదు. ఇక మహిళల మెగా ఈవెంట్లకు సంబంధించి ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది.