ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత మహిళా క్రికెట్ టీమ్... ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా..
అంతర్జాతీయ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐబీఎస్‌ఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్ గేమ్స్‌లో భారత అంధుల క్రికెట్ జట్లు, పతకాలు సాధించాయి. భారత మహిళా జట్టు, ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఓడించి స్వర్ణం గెలిచింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడిన భారత పురుషుల జట్టు, రజతంతో సరిపెట్టుకుంది..
ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్, 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. 9 ఓవర్లలో టీమిండియా టార్గెట్‌ని 43 పరుగులుగా నిర్దేశించారు. అయితే 3.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి, టార్గెట్‌ని ఊదేసింది భారత మహిళా జట్టు. ఐబీఎస్‌ఏ వరల్డ్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది భారత మహిళా క్రికెట్ టీమ్..
అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఘన విజయం అందుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 268 పరుగుల భారీ స్కోరు చేసింది. గంగవ్వ 60 బంతుల్లో 117 పరుగులు చేసి సెంచరీ నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్ 83 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకి 185 పరుగుల భారీ విజయం దక్కింది..
మహిళా జట్టు క్రియేట్ చేసిన ఫీట్‌ని పురుషుల జట్టు క్రియేట్ చేయలేకపోయింది. స్వర్ణ పతక పోరులో దాయాది పాకిస్తాన్ చేతుల్లో ఓడింది టీమిండియా. డీఆర్ తొంపకీ, వీఆర్ దున్నా కలిసి మొదటి 6 ఓవర్లలోనే టీమిండియాకి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. దున్నా 18 బంతుల్లో 20 పరుగులు చేయగా తొంపకీ 51 బంతుల్లో 11 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. ఎస్ రమేశ్ 29 బంతుల్లో 48 పరుగులు చేశాడు. టీమిండియా 184 పరుగుల భారీ స్కోరు చేసింది..
అయితే మహ్మదుల్లా, ఎన్ ఆలీ 2 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో పాకిస్తాన్‌కి మెరుపు ఆరంభం దక్కింది. మహ్మద్ సల్మాన్ 25 బంతుల్లో 48 పరుగులు చేయగా మునీర్ 12 బంతుల్లో 41 పరుగులు చేశాడు. దీంతో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది పాకిస్తాన్. ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏకంగా 28 వైడ్లతో 42 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వడం విశేషం..
