దేశానికో క్రికెట్ లీగ్..  ఫార్మాట్ లలో మార్పులు జరుగుతున్న వేళ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు.  వన్డే క్రికెట్ లో కూడా మార్పులు జరగాల్సిందేనని అన్నాడు.  

సుమారు 150 ఏండ్లుగా ఆడుతున్న క్రికెట్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. టెస్టు క్రికెట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్.. దానిని 50 ఓవర్లకు కుదించడం.. 2000వ దశకంలో టీ20 ఫార్మాట్.. గత కొంతకాలంగా అది కాస్తా టీ10లీగ్ లకు వచ్చింది. ఇక ఇంగ్లాండ్ లో అయితే ‘ది హండ్రెడ్’ పేరుతో వంద బంతుల్లోనే ముగిసే టోర్నీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్ లో కూడా మార్పులు జరగాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ టెస్టులో నాలుగోరోజు ఆట సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ... ‘వన్డే క్రికెట్ బతకాలంటే ఈ ఆటలో కూడా మార్పులు రావాల్సిందే. ఈ ఫార్మాట్ ను బతికించుకోవాలంటే 40 ఓవర్లకు కుదించాల్సిందే... 

నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మేం 1983లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఒక జట్టు 60 ఓవర్లు ఆడేది. తర్వాత దానిని 50 ఓవర్లకు కుదించారు. ఇక ఇప్పుడు (వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ను ఉద్దేశిస్తూ) దానిని 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఫార్మాట్ ను కుదిస్తేనే బెటర్.. ప్రస్తుతం క్రికెట్ లో టీ20 ఫార్మాటే ప్రధానం. ఆటకు ఇదే కామధేనువు. అంతర్జాతీయంగా ద్వైపాక్షిక సిరీస్ లు కూడా నియంత్రించాలి. ఇప్పటికే చాలా దేశాల్లో టీ20 ఫ్రాంచైజీలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రపంచకప్ లు వచ్చినప్పుడు ద్వైపాక్షిక గేమ్ లను కొన్నింటిని ఆడిస్తే సరిపోతుంది...’ అని చెప్పాడు. ఇలా చేస్తేనే క్రికెట్ లో అన్ని ఫార్మాట్లను బతికించుకోవచ్చని సూచించాడు. 

టెస్టు క్రికెట్ కు వచ్చిన నష్టమేమీ లేదని.. దానికున్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదని శాస్త్రి చెప్పాడు. ఇండియాలో అయితే అన్ని ఫార్మాట్లకు ఆదరణ ఉంది. ఆస్ట్రేలియాలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని శాస్త్రి తెలిపాడు.