ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకి సారథిగా వ్యవహరించబోతున్న స్టీవ్ స్మిత్... ఢిల్లీ టెస్టులో అవుటైన విధానంపై అసంతృప్తి..  టీమ్ ఆటతీరును మొత్తం మార్చేస్తానంటూ కామెంట్.. 

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రస్తుతం స్వదేశంలో ఉన్నాడు. అతని తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ప్యాట్ కమ్మిన్స్ ఇప్పట్లో ఇండియా తిరిగి రావడం అనుమానమే. బౌలర్‌గా కూడా మొదటి రెండు టెస్టుల్లో ప్యాట్ కమ్మిన్స్, తన మార్కు చూపించలేకపోయాడు. మొదటి రెండు టెస్టుల్లో కలిపి 3 వికెట్లు మాత్రమే తీసి, వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్ పొజిషన్‌ కూడా కోల్పోయాడు...

ప్యాట్ కమ్మిన్స్ గైర్హజరీలో ఇండోర్ టెస్టుకి స్టీవ్ స్మిత్ తాత్కాలిక సారథిగా వ్యవహరించబోతున్నాడు. స్టీవ్ స్మిత్‌కి టెస్టు కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. దీంతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది...

‘నేను నా కెరీర్‌లో 95 టెస్టు మ్యాచులు ఆడాను. అయితే నా కెరీర్‌లో ఎప్పుడూ కూడా ఛీ... ఇలా అవుట్ అయ్యా ఏంటి? అని ఫీల్ అవ్వలేదు. ఢిల్లీ టెస్టులో నేన అవుటైన విధానం నాకే నచ్చలేదు. నా కెరీర్‌లో ఎప్పుడూ నాపై నాకు ఇంత కోపం రాలేదు...

నేను ఎలా ఆడాలనుకున్నానో అలా ఆడలేకపోయాను. మొదటి రెండు టెస్టుల్లో కాస్త కంగారు పడ్డాను. మూడో టెస్టుకి ముందు చాలా సమయం దొరికింది. కంగారు లేకుండా నెమ్మదిగా ఆడాలని టీమ్‌కి చెప్పాను...

మా టీమ్‌లో క్రీజులో కుదురుకుపోయి, బౌలర్లకు విసుగు తెప్పించే బ్యాటర్లు ఉన్నారు. అయితే తొలి రెండు టెస్టుల్లో కాస్త తొందరపడ్డాం. దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే అంత తేలికైన విషయం కాదు...

అశ్విన్, జడేజా వారి దేశంలో అసాధారణంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇది వారి అడ్డా. అయితే ఈసారి ఓపికగా మరింత సమయం తీసుకోవడమపైనే ఫోకస్ పెట్టా. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు క్రీజులో ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత మంచిది...

ఇండియాలో ఎక్కడైనా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. చాలాసార్లు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వికెట్ పడిపోతుంది. చాలా తక్కువ సార్లు మాత్రమే మంచి బాల్‌కి అవుట్ అవుతాం. దాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్..

ఇండోర్ టెస్టుకి ముందు పిచ్‌ని పరిశీలించిన స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి చాలా సేపు మాట్లాడాడు. రెండు టెస్టుల్లో కలిసి 4 ఇన్నింగ్స్‌ల్లో 71 పరుగులే చేసిన స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రెండు సార్లు అవుట్ అయ్యాడు... 

నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన స్టీవ్ స్మిత్, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్‌ని డకౌట్ చేశాడు అశ్విన్. మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేసిన తర్వాత రెండో బంతికే స్టీవ్ స్మిత్ కూడా పెవిలియన్ చేరాడు...

రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు స్టీవ్ స్మిత్. వరల్డ్ నెం.2 టెస్టు బ్యాటర్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, 30 సెంచరీలతో ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు.