ఆ మాత్రం భయముండాలి వాన్..! గబ్బా పిచ్‌పై ఇంగ్లాండ్ మాజీ సారథి ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజనులు
AUSvsSA Test: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా.. బ్రిస్బేన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో దారుణంగా ఓడింది. రెండురోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు పండుగ చేసుకున్నారు.

దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా రెండ్రోజుల్లోనే ముగిసిన టెస్టుపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. తమకు అనుకూలంగా ఉండే విధంగా ఆతిథ్య జట్లు పిచ్ లను తయారుచేసుకోవడం కొత్తేమీ కాకున్నా మరీ అధ్వాన్నంగా రెండు రోజుల ఆట కూడా ముగియకుండానే పూర్తిస్థాయిలో బౌలింగ్ కు సహకరించే పిచ్ తయారుచేసుకున్నందుకు గాను ఆసీస్ క్రికెట్ జట్టు, బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు గబ్బా పిచ్ పై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి వాటిమీద వెంటనే స్పందించే ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘గబ్బా పిచ్ మీద చాలా గడ్డి ఉంటుంది. దానిని ఎందుకు తొలగించారో నాకు అర్థం కావడం లేదు. టెస్టు క్రికెట్ లో ఇది ప్రపంచంలోనే బెస్ట్ పిచ్ అనదగిన వాటిలో ఒకటి. అలాంటి పిచ్ మీద ఇలా ఎందుకు చేశారు..? పిచ్ చాలా షాకింగ్ గా ఉంది..’అని ట్వీట్ చేశాడు.
అయితే వాన్ ఈ ట్వీట్ చేసిన తర్వాత టీమిండియా ఫ్యాన్స్ తో పాటు పలువురు నెటిజన్లు వాన్ ను ఓ ఆటాడుకున్నారు. వాన్ కామెంట్స్ పై ట్రోల్స్, మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు. ‘ఇదిగో, ఈ భయం కావాలి మాకు.. పిచ్ మీద స్పందించకుంటే ఏమంటారో అనే భయం ఉంది కదా. అది ఉండాలి..’, ‘నాకు నీ భయం అర్థమవుతుందిలే. ఈ పిచ్ గురించి కామెంట్ చేయకుంటే నన్ను ట్రోల్ చేస్తారనేగా నువ్వు ఇప్పుడు వచ్చి కాకమ్మ కబుర్లు చెబుతున్నావ్..’, ‘వాస్తవానికి మైఖేల్ వాన్ ఈ పిచ్ గురించి మాట్లాడటానికి చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. కానీ స్పందించకుంటే ఏమవుతుందో అతడికి తెలుసు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా భారత్ తో పాటు ఉపఖండ పిచ్ లలో ఇలాంటి ఫలితాలు వస్తే నానా రచ్చ చేసే ఇంగ్లీష్ మీడియా, ఆస్ట్రేలియా మీడియా.. రెండు రోజులు కూడా జరగని సౌతాఫ్రికా పిచ్ గురించి మాత్రం గొప్పలకు పోతుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ వాపోతున్నారు. ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఘాటుగానే స్పందించాడు. టెస్టు మ్యాచ్ ముగిశాక వీరూ స్పందిస్తూ.. ‘‘142 ఓవర్లు... సరిగ్గా రెండు ఓవర్లు కూడా మ్యాచ్ సాగలేదు. వీళ్లు పిచ్‌లు ఎలా ఉండాలో కబుర్లు చెబుతారు. ఇదే ఇండియాలో జరిగి ఉంటే, టెస్టు క్రికెట్ చచ్చిపోతుందనే, సంప్రదాయ ఫార్మాట్‌కి గోరీ కడుతున్నారని రచ్చ చేసేవాళ్లు. ఇవన్నీ కపట నాటకాలు... ’’ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఉపఖండ పిచ్‌ల్లో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసి ఉంటే వచ్చే రియాక్షన్స్ వేరేగా ఉండేవి. టెస్టు క్రికెట్‌ని చంపేస్తున్నారని తెగ గోల చేసేవాళ్లు..’ అంటూ మీమ్ పోస్టు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..
ఇక గబ్బా టెస్టు విషయానికొస్తే.. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 152 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 218 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 99 పరుగులకే పరిమితమైంది. 34 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇరు జట్లు కలిసి రెండు రోజులు పూర్తి ఆట కూడా ఆడలేదు. 144 ఓవర్లలో నాలుగు ఇన్నింగ్స్ ముగిశాయి.