మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్రీజు దాటబోయిన జోస్ బట్లర్... ‘నేను దీప్తిని కాదు, అయినా రనౌట్ చేస్తా..’ అంటూ హెచ్చరించిన మిచెల్ స్టార్క్... వీడియో వైరల్ కావడంతో స్టార్క్‌పై విమర్శల వర్షం...
ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉండే నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఆసీస్, సెడ్జింగ్‌కి బ్రాండ్ అంబాసిడర్. తాజాగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో ఇలాంటి నోటి దురుసుతోనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్...
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య కాన్‌బెర్రాలో జరిగిన మూడో టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ కాగా 19 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ని ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేశాడు...
41 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేసిన జోస్ బట్లర్‌తో పాటు 10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మిచెల్ స్టార్క్, నాన్ స్ట్రైయికింగ్‌లో ఉన్న జోస్ బట్లర్ బాల్ వేయకముందే క్రీజు దాటడాన్ని గమనించి హెచ్చరించాడు...
క్రీజులో ఉండాల్సిందిగా జోస్ బట్లర్‌ని హెచ్చరించిన మిచెల్ స్టార్క్... ‘ఐ యామ్ నాట్ దీప్తి బట్ ఐ క్యాన్ డూ ఇట్... (నేను దీప్తిని కాను, అయినా నేను అవుట్ చేస్తా)...’ అంటూ చేసిన వ్యాఖ్యలు స్టంప్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మన్కడింగ్‌ని ఐసీసీ ఎప్పుడో రనౌట్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైయికర్ క్రీజు దాటితే ఎలాంటి హెచ్చరిక లేకుండా రనౌట్ చేయొచ్చని ఐసీసీ నిబంధనల్లో సవరణలు కూడా చేసింది...
అలాంటప్పుడు ‘క్రీజు దాటకు రనౌట్ చేస్తా...’ అని చెప్పి ఉంటే సరిపోయేది. మధ్యలో దీప్తి ప్రస్తావన తేవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ‘నేను ఆమెలా కాదు...’ అంటే మిచెల్ స్టార్క్ ఉద్దేశం ఏంటి? ఆమె క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందనా? లేక దీప్తి చేసిన పని తప్పు అనా... లేక ఇంకేదైనా? అంటూ కామెంట్లు పెడుతూ మిచెల్ స్టార్క్‌ని టార్గెట్ చేస్తున్నారు అభిమానులు...
ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ, చార్లీ డీన్‌ని నాన్ స్ట్రైయికర్ ఎండ్‌లో రనౌట్ చేసింది. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, చార్లీ డీన్‌పైనే ఆశలు పెట్టుకోవడం, ఆమె ఇలా అవుట్ కావడంతో దీప్తి శర్మను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ మీడియా వరుస కథనాలు ప్రచురించింది. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ పురుష క్రికెటర్లు కూడా దీప్తి శర్మ చేసిన పనిని తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేశారు...
ఈ విషయంపై కొన్ని వారాల పాటు చర్చ నడిచింది. మళ్లీ ఇప్పుడు మిచెల్ స్టార్క్ ఈ విధంగా దీప్తి శర్మ ప్రస్తావన తీసుకొచ్చి, మరోసారి ఈ వివాదాన్ని లేపాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో క్యాచ్ అందుకునేందుకు వస్తున్న మార్క్ వుడ్‌ని చేతులతో లాగుతూ అడ్డుకున్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాజాగా అనవసరంగా దీప్తి శర్మ పేరును ప్రస్తావించి, మిచెల్ స్టార్క్ వివాదాల్లో ఇరుక్కోవడం విశేషం..
జోష్ బట్లర్‌ని మిచెల్ స్టార్క్ మన్కడింగ్ రనౌట్ చేసి ఉన్నా ఇంత పెద్ద రచ్చ జరిగేది కాదు. ఇప్పటికే ఈ విధంగా రెండు సార్లు పెవిలియన్ చేరాడు జోస్ బట్లర్. 2014లో లంక క్రికెటర్ సచిత్ర సెననయకే చేతుల్లో ఈ విధంగా రనౌట్ అయిన జోస్ బట్లర్, 2019 ఐపీఎల్‌లోనూ ఇదే విధంగా పెవిలియన్ చేరాడు...
2019లో క్రీజు దాటిన జోస్ బట్లర్‌ని రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేశాడు. ఆ సమయంలో కూడా ఇంగ్లీష్ మీడియా, అశ్విన్‌పై ద్వేషాన్ని వెళ్లగక్కింది. అశ్విన్ చేసిన పని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని క్రికెటర్లు కామెంట్లు చేశారు. అయితే తాను చేసిన పని, ఐసీసీ రూల్ బుక్స్‌లో ఉందని గట్టిగా వాదించిన రవిచంద్రన్ అశ్విన్, విమర్శకులకు తన స్టైల్‌లో గట్టి సమాధానం చెప్పాడు..
