క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ ఐపీఎల్ కోసం ధోనీ అభిమానులు ఎదరుచూసినంతగా మరెవరూ చూడలేదు. వాళ్ల ఎదురుచూపులకు తెరపడింది. చాలా కాలం తర్వాత ధోనీ మైదానంలోకి అడుగుపెట్టాడు. చాలా నెలల తర్వాత మహీని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ తన న్యూ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని, గతం కంటే భిన్నంగా కనిపించాడు. ఆయన ఫిట్‌నెస్‌, హెయిర్‌ స్టైల్‌ సరికొత్తగా ఉన్నాయి.

శనివారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచిన తర్వాత ఎంఎస్ ధోనీ మాట్లాడాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో (ధోనీ చేతిలో మైక్‌ ఉన్న ఫొటో)ని ధోనీ భార్య సాక్షి సింగ్‌.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు ఆ ఫొటోకి ఓ అద్భుత కాప్షన్ ఇచ్చారు. 'మహీ ఎంత అందంగా ఉన్నాడో' అని సాక్షి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. సీఎస్‌కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తరువాత లాక్‌డౌన్‌లో క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు అని ఎంఎస్ ధోనీని భరత మాజీ క్రికెటర్‌ మురళీ కార్తీక్ అడిగాడు. 'లాక్‌డౌన్‌లో స్వేచ్చగా, ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతోనే గడిపాను. తనతోనే ఉండడంతో జీవా సంతోషించింది' అని మహీ చెప్పాడు. లాక్‌డౌన్‌ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నందుకు మిగతా జట్టు సభ్యులను కూడా అభినందించాడు. కాగా జీవా, సాక్షి రాంచీలోనే ఉన్నారు.