టీమిండియా వికెట్ కీపర్ ధినేశ్ కార్తిక్ తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఆ సంఘటన ఇప్పుడు ఫన్నీగా అనిపించినా ఆ సమయంలో తననెంతో బాధించిందని తెలిపాడు. అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ సహచరులందరి ముందే మైదానంలోనే తనని ఘోరంగా అవమానించినట్లు కార్తిక్  బయటపెట్టాడు. అప్పుడప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన తనకు ఆ సంఘటన తీవ్రంగా కలచివేసిందని స్వయంగా అతడే వెల్లడించాడు. 

ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దినేశ్ కార్తిక్ తన కెరీర్ కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా 2004 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన అవమానాన్ని అతడు గుర్తుచేసుకున్నాడు. '' 2004 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో నా వయస్సు 18 ఏళ్లు. గంగూలీ సారథ్యంలోని భారత జట్టులో నాకు చోటు దక్కింది. అయితే సెప్టెంబర్ 19వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ నాకు తుది జట్టులో దక్కలేదు. కానీ సబ్‌స్టిట్యూట్ గా ఎంపికయ్యారు. 

మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో పాక్ వికెట్ పడింది. మరో బ్యాట్స్ మెన్ క్రీజులోకి వచ్చేలోగా నేను భారత ఆటగాళ్లకు నీళ్లు అందించి రావాలి. దీంతో హడావుడిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ముందుగా గంగూలీకి వాటర్ బాటిల్ ఇద్దామని వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక అతడిని ఢీకొన్నాను. ముందే మ్యాచ్ ఒత్తిడిలో సీరియస్ గా వున్న అతడికి ఈ ఘటన మరింత చిర్రెత్తించింది. దీంతో ' ఇలాంటోళ్లను ఎక్కడినుండి పట్టుకోస్తారో తేలీదు' అంటూ కొప్పడ్డాడు.'' అని కార్తిక్ అప్పటి సంఘటనను గుర్తుుచేసుకున్నాడు. 

అయితే ఈ సమయంలో యువరాజ్ సింగ్ కూడా మైదానంలోనే వున్నాడు. దీంతో కార్తిక్ ఇటర్వ్యూ వీడియోపై కామెంట్ చేసిన అతడు గంగూలీ ఎగ్జాట్ గా ఏమన్నాడో తెలిపాడు. '' ఈ పిచ్చోడు ఎవడ్రా..! ఎక్కడినుండి ఇలాంటోళ్ళను పట్టుకొస్తారు.'' అంటూ కార్తిక్ పై గంగూలీ చిందులు తొక్కినట్లు యువరాజ్ బయటపెట్టాడు.