Virat Kohli: వెస్టిండీస్  పర్యటనలో భాగంగా  టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చే వ్యవహారంపై భారత  క్రికెట్ లో తీవ్ర చర్చ  నడుస్తున్నది.  

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి వెస్టిండీస్ పర్యటనలో టీ20లకు ఆడతాడో లేదో గానీ అతడి మీద చర్చ మాత్రం విపరీతంగా నడుస్తున్నది. కోహ్లిని ఆడించాలని ఒకరు.. అవసరం లేదని మరొకరు.. తీసేయాలని మరికొందరు. అబ్బో ఈ ఏడాది ప్రారంభంలో కోహ్లి-గంగూలీ-బీసీసీఐ వివాదం తర్వాత భారత క్రికెట్ లో ఈస్థాయి చర్చ ఇప్పట్లో జరగలేదంటే అతిశయెక్తి కాదు. ఐపీఎల్-15వ సీజన్ ముగిసిన తర్వాత కోహ్లికి విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. సఫారీ సిరీస్ లో అతడు ఆడలేదు. ఇంగ్లాండ్ తో మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న కోహ్లి మూడేండ్లుగా కొనసాగిస్తున్న విఫల ఫామ్ ను కొనసాగిస్తునే కాలాన్నినెట్టుకొస్తున్నాడు. 

ఇక ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా వన్డేలలో కోహ్లికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. టీ20లలో కూడా అలాగే చేస్తారని.. అతడే సెలవు కావాలని కోరినట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. 

అయితే తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ సెలక్టర్ శరణ్దీప్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి ఒంటిచేత్తో ప్రపంచకప్పులు గెలిపించే సత్తా ఉందని అన్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అతడి బ్యాటింగ్ లో లోపాలు ఏమున్నాయో అర్థం చేసుకోవడానికి సెలక్టర్లు ఏం చేస్తున్నారు. అతడ్ని జట్టు నుంచి తప్పించకూడదు. కోహ్లి శక్తి, సామర్థ్యాలు అందరికీ తెలుసు. కోహ్లి ఒంటిచేత్తో ప్రపంచకప్ లు గెలవగల సమర్థుడు..’అని అన్నాడు. 

అంతేగాక ‘కోహ్లికి వరుస సిరీస్ లలో రెస్ట్ ఎందుకు ఇస్తున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సెలక్టర్లు ఏం లాజిక్ పాటిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కోహ్లిని ఒక సిరీస్ లో ఆడించి మరో సిరీస్ లో పక్కనబెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అతడిని ఆడనివ్వండి. అతడు సరిగా ఆడకుంటే మీరు అతడికి మద్దతునిచ్చి ఎక్కువ మ్యాచులు ఆడించాలి. అప్పుడే అతడు తిరిగి పాత ఫామ్ ను అందుకుంటాడు గానీ ఆటకు దూరంగా టీవీల ముందు కూర్చుని మ్యాచ్ చూస్తే ఫామ్ ఎలా వస్తుంది..?’ అని తెలిపాడు. 

ఇక కోహ్లి ఫామ్ గురించి మాట్లాడుతూ.. ‘ఫామ్ గురించి మాట్లాడాల్సివస్తే ప్రతి ఆటగాడు తమ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూస్తాడు దాని కారణంగా సదరు ఆటగాడి విలువ తగ్గిపోదు. మనం ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒక ఆటగాడు చాలాకాలంగా బాగా ఆడి కొద్దిమ్యాచ్ లలో ఆడలేదని పక్కనబెట్టడం సరికాదు. అతడి ప్రాధాన్యమేంటే తెలుసుకోవాలి...’అని వ్యాఖ్యానించాడు. 

అయితే శరణ్దీప్ సింగ్ చెప్పిందాట్లో అంతా బాగానే ఉంది గానీ కోహ్లి తన కెరీర్ లో కెప్టెన్ గా ఎన్ని ప్రపంచకప్పులు గెలిచాడని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో సభ్యుడుగా ఉన్నాడు కోహ్లి. అవి భారత దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వచ్చినవే. ఆ తర్వాత సారథ్య పగ్గాలు చేపట్టిన కోహ్లి ఎన్ని ఐసీసీ టోర్నీలలో ప్రపంచకప్పులు నెగ్గాడని శరణ్దీప్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కోహ్లి సారథ్యంలో ఒక వన్డే ప్రపంచకప్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ తో పాటు ఒక టీ20 ప్రపంచకప్ లలో పాల్గొంది భారత జట్టు. కానీ ఒక్కదాంట్లో కూడా కప్ నెగ్గలేదు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లి న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయాన్ని శరణ్దీప్ కు గుర్తు చేస్తున్నారు నెటిజనులు,