Asianet News TeluguAsianet News Telugu

హ్యారీ బ్రూక్ హ్యాట్రిక్ సెంచరీ.. రసవత్తరంగా కరాచీ టెస్టు

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు  అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్నది. కరాచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆ జట్టు  బ్యాటర్  హ్యారీ బ్రూక్  మరోసారి సెంచరీతో కదం తొక్కాడు. 

Harry Brook Smashes Another Hundred, England All Out For 354 in Karachi Test
Author
First Published Dec 18, 2022, 6:18 PM IST

ఇంగ్లాండ్ యువ బ్యాటర్  హ్యారీ బ్రూక్ పాకిస్తాన్ లో పరుగుల వరద పారిస్తున్నాడు.  తన కెరీర్ లో నాలుగో టెస్టు ఆడుతున్న బ్రూక్.. పాకిస్తాన్ తో మూడు టెస్టులలోనూ సెంచరీలు బాదాడు.  రావల్పిండి వేదికగా ముగిసిన తొలి టెస్టులో 153 పరుగులు చేసిన బ్రూక్.. ముల్తాన్ లో జరిగిన రెండో టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ లో 108 పరుగులు చేశాడు. ఇక కరాచీ  టెస్టులో  మిగిలిన బ్యాటర్లు విఫలమైనా బ్రూక్ మాత్రం మరోసారి పట్టుదలతో ఆడి  సెంచరీ చేశాడు.  కరాచీలో 150 బంతులాడి 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో  111 పరుగులు చేశాడు. బ్రూక్ సెంచరీ,  బెన్ ఫోక్స్  హాఫ్ సెంచరీ (64) తో  ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 81.4 ఓవర్లలో 354 పరుగులు చేసింది. 

తొలి రోజు  పాకిస్తాన్ ను 304 పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లాండ్..  రెండో రోజు పాక్ మాదిరే తడబడింది.  జాక్ క్రాలేను తొలిరోజే ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసిన అబ్రర్.. రెండో రోజు ఓలీ పోప్ (51) ను  బౌల్డ్ చేశాడు.  మరో స్పిన్నర్ నౌమన్ అలీ.. డకెట్ (26) తో  పాటు  జో రూట్ (0) ను  ఔట్ చేసి పాకిస్తాన్ కు  బ్రేక్ ఇచ్చాడు. 98 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. 

 కెప్టెన్ బెన్ స్టోక్స్ (26)  కూడా విఫలమయ్యాడు.  అయితే  ఫోక్స్ తో కలిసి బ్రూక్.. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.   ఇద్దరూ కలిసి  ఆరో వికెట్ కు  117 పరుగులు జోడించారు. సెంచరీ తర్వాత బ్రూక్ ను వసీమ్ జూనియర్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ వెంటనే  నౌమన్ అలీ.. రెహన్ అహ్మద్ (1) ను  ఔట్ చేశాడు. కానీ  మార్క్ వుడ్ (35), రాబిన్సన్ (29) కలిసి  చివర్లో  ధాటిగా ఆడి ఇంగ్లాండ్ స్కోరును  350 దాటించారు. తద్వారా ఇంగ్లాండ్ కు 50 పరుగుల  స్వల్ప ఆధిక్యం దక్కింది. 

 

అనంతరం  రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. 9 ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా  21 పరుగులు చేసింది.  అబ్దుల్లా షఫీక్ (14 నాటౌట్), షాన్ మసూద్ (3 నాటౌట్)  క్రీజులో ఉన్నారు.  ఈ టెస్టులో మరో మూడు రోజులు ఆట మిగిలిఉండటం.. ఫిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో కరాచీలోనూ ఫలితం తేలే విధంగా కనిపిస్తున్నది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios