ICC: అంతర్జాతీయ క్రికెట్ మండలి  (ఐసీసీ) ప్రతినెలా క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన ఆటగాళ్లకు  ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ను ప్రకటిస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి అవార్డులు కూడా వెలువడ్డాయి. 

ప్రతినెలా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే పురుషుల, మహిళల క్రికెట్ లో ఒకరిని ఎంపిక చేసి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలకూ ఈ అవార్డులను విడుదల చేసింది. గతనెలలో మెన్స్ క్రికెట్ లో ఇంగ్లాండ్ సంచలనం హ్యారీ బ్రూక్ ఈ అవార్డును సొంతం చేసుకోగా.. ఉమెన్స్ క్రికెట్ విభాగంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ దక్కించుకుంది. 

ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. బ్రూక్, గార్డ్‌నర్ లకు ఈ అవార్డు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అవార్డు కోసం బ్రూక్, గార్డ్‌నర్ లు ఇతర ఆటగాళ్ల నుంచి కూడా తీవ్ర పోటీ ఎదుర్కున్నారు. 

గతేడాది టెస్టులలో ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లాండ్ సంచలనం బ్రూక్.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్ లో రాణించాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ రెండు హాఫ్ సెంచరీలు చేసిన బ్రూక్.. ఇక రెండో టెస్టులో మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 21కే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చిన బ్రూక్.. 176 బంతుల్లోనే 186 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ మారథాన్ ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. బ్రూక్ కు డిసెంబర్ లో కూడా ఈ అవార్డు వరించింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవడం అతడికి ఇది రెండోసారి. 

Scroll to load tweet…

ఇక ఉమెన్స్ కేటగిరీలో అవార్డు గెలిచిన గార్డ్‌నర్.. గత నెలలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ లో రాణించింది. ఈ యువ ఆల్ రౌండర్.. బ్యాటింగ్ లో 110 పరుగులు చేయడమే గాక తన స్పిన్ తో పది వికెట్లు తీసింది. ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలవడంలో గార్డ్‌నర్ ది కీలక పాత్ర. 

Scroll to load tweet…

కాగా గార్డ్‌నర్ ఈ అవార్డు సొంతం చేసుకునేందుకు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నటాలీ సీవర్ తో పాటు దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కుంది. కానీ చివరికి గార్డ్‌నర్ కే అవార్డు దక్కడం గమనార్హం. బ్రూక్ కూడా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటు వెస్టిండీస్ గుడకేశ్ మోటీల నుంచి పోటీని ఎదుర్కున్నాడు. బ్రూక్.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో బ్రూక్ పై సన్ రైజర్స్ భారీ ఆశలే పెట్టుకుంది. ఇక గార్డ్‌నర్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడుతున్న విషయం విదితమే.