ENG vs IND T20I: టీ20 సిరీస్ ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. ముందు బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేసిన భారత జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అదరగొట్టి విజయాన్ని అందుకుంది.
‘వాళ్ల బ్యాటింగ్ ముందు మన బౌలింగ్ నిలబడగలదా..?’, ‘వాళ్లంతా టీ20 స్పెషలిస్టులే.. మన బౌలర్లకు చుక్కలే..’, ‘ఇంగ్లాండ్ ఫుల్ ఫామ్ లో ఉంది. వారిపై గెలవడం కష్టమే..’ ఇవీ ఇంగ్లాండ్ తో తొలి టీ20కి ముందు వినిపించిన కామెంట్లు. కానీ టీమిండియా అద్భుతం చేసింది. సమిష్టిగా ఆడితే ఇంగ్లాండే కాదు ఎవరైనా తల వంచాల్సిందేనని నిరూపించింది. ‘బ్యాజ్ బాల్’ ఫార్ములాను ఒంటబట్టించుకున్నామని.. ఇక మా దూకుడుకు ఎవరైనా గులాములు కావాల్సిందేనని విర్రవీగుతున్న ఇంగ్లాండ్ కు అసలైన బ్యాజ్ బాల్ ఆటెలా ఉంటుందో రుచి చూపెట్టింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ లో రాణించిన హార్దిక్.. బ్యాటింగ్ (33 బంతుల్లో 51.. 6 ఫోర్లు, 1 సిక్సర్) లోనూ రాణించాడు.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు ఆది నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. భువనేశ్వర్ కుమార్ ఇంగ్లీష్ జట్టుకు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. అతడు వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి భీభత్సమైన ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్ (0) క్లీన్ బౌల్డయ్యాడు.
పాండ్యా మ్యాజిక్..
ఇక నాలుగో ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా.. ఇంగ్లాండ్ కు ఒకే ఓవర్లో డబుల్ షాకులిచ్చాడు. రెండో బంతికి డేవిడ్ మలన్ (21) ను బౌల్డ్ చేసిన పాండ్యా.. చివరి బంతికి ప్రమాదకర లివింగ్ స్టోన్ (0) కూడా పెవిలియన్ కు పంపాడు. పాండ్యా తన తర్వాత ఓవర్లో జేసన్ రాయ్ (4) ను కూడా ఔట్ చేసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 7 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులే చేసింది.
చాహల్ డబుల్ బ్లో..
ఇక హర్షల్ పటేల్ బౌలింగ్ లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన హ్యరీ బ్రూక్ (23 బంతుల్లో 28.. 2 ఫోర్లు, 1 సిక్సర్) తో జతకలిసిన మోయిన్ అలీ (20 బంతుల్లో 36.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్ కు 61 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని చాహల్ విడదీశాడు. చాహల్ వేసిన 13వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ కు యత్నించిన బ్రూక్.. డీప్ మిడ్ వికెట్ వద్ద సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. అదే ఓవర్లో చాహల్.. అలీని కూడా బోల్తా కొట్టించాడు. ఐదో బంతికి అలీ స్టంపౌట్ అయ్యాడు.
14వ ఓవర్ వేసిన పాండ్యా.. ఐదో బంతికి సామ్ కరన్ (4) ను ఔట్ చేశాడు. ఇది అతడికి ఈ మ్యాచ్ లో నాలుగో వికెట్. 16వ ఓవర్ వేసిన హర్షల్.. టైమల్ మిల్స్ (7) ను వెనక్కి పంపాడు. మిగిలిన వాళ్లు కూడా పెద్దగా మెరుపులు మెరిపించలేదు. 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్.. 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో హార్ధిక్ కు 4 వికెట్లు దక్కగా.. చాహల్, అర్ష్దీప్ రెండు.. హర్షల్, భువీ తలో వికెట్ పడగొట్టారు. తొలి మ్యాచ్ ఆడుతున్న అర్ష్దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
