రికార్డుల రారాజు, పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు తన 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికే కోహ్లీ... ఈ బర్త్ డే మరింత అద్భుతంగా జరుపుకునేందుకు భార్య అనుష్క శర్మతో కలిసి విహారానికి వెళ్లాడు. భూటాన్ పర్యటనకు వెళ్లినట్లు కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

భూటాన్ లో వారు పర్యటిస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడదియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలను అనుష్క  శర్మ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వచ్చాయని ఈ సందర్భంగా అనుష్క పేర్కొంది. సేంద్రియ కూరగాయల మార్కెట్, దేవాలయాలను ఈ సందర్భంగా విరుష్క జంట సందర్శించింది.

గత సంవత్సరం జన్మదినాన విరుష్క జోడీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో గడపడం విశేషం. ఈసారి వాళ్లు భూటాన్‌ వెళ్లారు. ఇక..నిరుడు విరాట్‌ బర్త్‌డే సందర్భంగా..‘కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు’ అని అనుష్క చేసిన ట్వీట్‌ విరాట్‌ అభిమానుల హృదయాలను కదిలించింది. ఇకపోతే..ఈసారి కోహ్లీ పుట్టినరోజున స్టార్‌స్పోర్ట్స్‌ సూపర్‌ ‘వి’ పేరిట రూపొందించిన సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను మంగళవారం (మధ్యాహ్నం 3.30) ప్రసారం చేస్తోంది. 

15 ఏళ్ల వయస్సులో పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటినుంచి టీమిండియా కెప్టెన్‌ అయ్యే క్రమంలో కోహ్లీ ఎదుర్కొన్న కష్ట నష్టాలను, సాధించిన విజయాలను ఈ ఎపిసోడ్లలో వివరించారు. అలాగే చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్‌ సంబంధాలను కళ్లకు కట్టనున్నారు. మొత్తంగా సూపర్‌ ’వి’ దేశ టీనేజర్లకు స్ఫూర్తినిచ్చేలా రూపొందించారు. మొదటి ఎపిసోడ్‌ మంగళవారం టెలికాస్ట్‌ కానున్నా..మిగిలిన 11 తదుపరి ఆదివారాలు ఉదయం 9 గంటలనుంచి స్టార్‌ప్లస్‌, స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ, మార్వెల్‌ హెచ్‌క్యూ, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి.

ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ తలపడుతుండగా... ఈ సిరీస్ కి కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.