మొదటి రెండు టెస్టుల్లో పెద్దగా పర్ఫామెన్స్ కనబర్చకపోయినా, కెఎల్ రాహుల్‌కి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవడంతో మూడో టెస్టులోనూ చోటు దక్కించుకున్నాడు హనుమ విహారి. టెస్టుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న విహారి, రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు కూడా. అయితే వరుస వైఫల్యాల కారణంగా విహారి ఒత్తిడికి గురైనట్టు స్పష్టంగా తెలుస్తోంది.

తొలి ఇన్నింగ్స్‌లో 38 బంతుల్లో 4 పరుగులు చేసి రనౌట్ అయిన హనుమ విహారి, ఫీల్డింగ్‌లోనూ అదే రకమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగో రోజు ఆట ప్రారంభించిన రెండో బంతికే హనుమ విహారి చేతుల్లోకి క్యాచ్ ఇచ్చాడు లబుషేన్. అయితే చేతుల్లోకి వచ్చిన ఆ క్యాచ్‌ను విహారి జారవిరిచాడు. దీంతో భారత జట్టుకు అద్భుత అవకాశం మిస్ అయింది.

అప్పటికి 46 పరుగులతోనే ఉన్న లబుషేన్, 73 పరుగులు చేశాడు. ఆట ప్రారంభమైన రెండో బంతికే వికెట్ పడి ఉంటే, ఆసీస్ ఒత్తిడిలోకి వెళ్లి ఉండేది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రావడం వల్ల భారత జట్టుకి పై చేయి సాధించే అవకాశం దొరికి ఉండేది. విహారి క్యాచ్ డ్రాప్ వల్ల ఆ అవకాశాన్ని చేజార్చుకుంది టీమిండియా.

ఈ డ్రాప్‌తో విహారిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ వినబడుతున్నాయి. అతన్ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. విహారి ప్రదర్శన చూస్తుంటే మనోడికి నాలుగో టెస్టులో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. నాలుగో ఇన్నింగ్స్‌లో రాణించకపోతే అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.