క్రీడా విభాగం నుంచి ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు... టీమిండియా మాజీ కోచ్ గురుచరణ్ సింగ్, కేరళ కలరియట్టు గురు ఎస్.ఆర్‌.డీ ప్రసాద్‌, మణిపూర్‌ మార్షల్ ఆర్ట్స్‌ ఠాంగ్ ఠా గురు కె. సనతోయిబా శర్మకు పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం... 

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 106 మందికి పద్మ పురస్కారాలు దక్కగా వీరిలో ముగ్గురికి మాత్రమే క్రీడా విభాగం నుంచి పద్మశ్రీ అవార్డులు దక్కాయి...

భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ గురుచరణ్ సింగ్‌, పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్నారు. 1935లో రావల్పిండిలో జన్మించిన గురుచరణ్ సింగ్, 1947లో దేశవిభజన తర్వాత పటియాలా చేరుకున్నారు...

పటియాలా మహారాజు యద్వేంద్ర సింగ్‌కి గురుచరణ్ సింగ్ క్రికెట్ ఆటతీరు ఎంతో నచ్చింది. పటియాలా జట్టుతో పాటు ఈస్టరన్ పంజాబ్ స్టేట్స్ యూనియన్, సౌథరన్ పంజాబ్, రైల్వేస్ టీమ్స్‌కి ఆడిన గురుచరణ్ సింగ్, కోచ్‌గా మారడానికి ముందు 37 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడారు...

37 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 19.96 సగటుతో 1198 పరుగులు చేసిన గురుచరణ్ సింగ్, ఓ సెంచరీతో పాటు బౌలింగ్‌లో 44 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత కోచ్‌గా మారారు. భారత జట్టుకి ఆడిన కిర్తి ఆజాద్, మనిందర్ సింగ్, వివేక్ రజ్దాన్, గురుశరణ్ సింగ్, అజయ్ జడేజా, రాహుల్ సాంగ్వీ, మురళీ కార్తీక్ వంటి క్రికెటర్లు, గురుచరణ్ సింగ్ కోచింగ్‌లో రాటుతేలిన వాళ్లే. పటియాలాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో కోచింగ్ డిప్లామా దక్కించుకున్న గురుచరణ్ సింగ్, న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు...

1977 నుంచి 1983 వరకూ నార్త్ జోన్‌కి, 1985లో మాల్దీవ్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన గురుచరణ్ సింగ్, 1986-87 ఏడాదిలో భారత క్రికెట్ టీమ్‌కి కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత 1992లో పేస్ బౌలింగ్ అకాడమీని స్థాపించారు గురుచరణ్ సింగ్. లక్ష్మీభాయి నేషనల్ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఏడ్యూకేషన్, బీసీసీఐ అనుబంధ సంస్థగా గ్వాలియర్‌లో ప్రారంభమైందీ పేస్ బౌలింగ్ అకాడమీ...

Scroll to load tweet…

భారత క్రికెట్‌కి గురుచరణ్ చేసిన సేవలకు గుర్తుగా 1987లో కేంద్ర ప్రభుత్వం ‘ద్రోణాచార్య’ అవార్డుతో సత్కరించింది. దేశ్ ప్రేమ్ అజాద్ తర్వాత ద్రోణాచారత్య అవార్డు దక్కించుకున్న రెండో భారత క్రికెట్ కోచ్ గురుచరణ్ సింగే...

గురుచరణ్ సింగ్‌తో పాటు మణిపూర్‌ మార్షల్ ఆర్ట్స్‌ ఠాంగ్ ఠా గురు కె. సనతోయిబా శర్మకు కూడా స్పోర్ట్స్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం దక్కింది. కేరళ సంప్రదాయ కలరిపయట్టు గురు ఎస్.ఆర్‌.డీ ప్రసాద్‌ కూడా సనాతన మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన అందించిన సేవలకు గుర్తుగా పద్మశ్రీ అందుకోబోతున్నారు.