IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ముంబైకి గుడ్ న్యూస్ చెప్పాడు.
ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ గత సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో అయినా తిరిగి పుంజుకోవాలని భావిస్తున్న ఆ జట్టుకు ఇదివరకే భారీ షాక్ తాకింది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇది ముంబైకు భారీ షాకే. దీనితో పాటు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అయినా ఈ సీజన్ కు అందుబాటులో ఉంటాడా..? ఉండడా..? అన్న అనుమానం ఆ జట్టు అభిమానులను వేధించేది. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాటికి తెరదించింది.
2022 ఐపీఎల్ వేలంలో ఆర్చర్ ను రూ. 8 కోట్లు పెట్టి దక్కించుకున్న ముంబై.. ఆ సీజన్ లో అతడు ఆడడని తెలిసినా ముంబై అతడికి భారీ ధర వెచ్చించింది. అయితే 2022 సీజన్ లో ఆడకపోయినా అతడు తర్వాతి సీజన్లలో ఆడతాడని ఆ జట్టు భావించింది. అయితే గాయాలతో సావాసం చేసే ఆర్చర్ ఈ సీజన్ కు కూడా అందుబాటులో ఉండడని గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి.
కాగా తాజా సమాచారం మేరకు ఆర్చర్.. ఐపీఎల్ - 2023 మొత్తానికి అందుబాటులో ఉంటాడని సమాచారం. ఇదే విషయమై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతినిధి ఒకరు క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ - 16 సీజన్ ఆడేందుకు ఆర్చర్ సిద్ధంగా ఉన్నాడు. అయితే అతడి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి ముంబై ఇండియన్స్, ఈసీబీ చూసుకుంటాయి..’అని చెప్పాడు.
బుమ్రా సీజన్ కు అందుబాటులో లేకపోవడంతో ఆర్చర్ పై భారీ ఆశలే నెలకొన్నాయి. ఆ జట్టుకు ఫాస్ట్ బౌలర్లలో అతడే కీలక ప్లేయర్. గతేడాది సరైన బౌలర్లు లేకనే ముంబై కీలక మ్యాచ్ లలో భారీగా పరుగులిచ్చుకుని దారుణ ఓటములు మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు మాత్రం దానిని పునరావృతం కావొద్దని రోహిత్ అండ్ కో. భావిస్తున్నది. ఈ సీజన్ లో ముంబైకి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ రూపంలో మెరుగైన ఆటగాడు దొరికాడు. ఆర్చర్ కు తోడుగా మరొక నాణ్యమైన పేసర్ ఉంటే మిడిల్ ఓవర్స్ లో గ్రీన్ తో లాగించడం ముంబైకి అత్యావశ్యకం.
ఇక ఆర్చర్ ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన ఎస్ఎ 20 లీగ్ లో పాల్గొన్నాడు. ఈ లీగ్ లో కూడా ఆర్చర్ ముంబై ఫ్రాంచైజీ ఎంఐ కేప్‌టౌన్ తరఫునే ఆడాడు. దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ తో పాటు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ వన్డే జట్టులో కూడా అతడు సభ్యుడు. బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో ఆర్చర్.. పది ఓవర్లు బౌలింగ్ చేసి 37 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
