Asianet News TeluguAsianet News Telugu

Andrew Symonds: ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా.. సైమండ్స్ కు హర్భజన్ కన్నీటి నివాళి

Andrew Symonds Death: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మృతికి  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, అతడితో కలిసి పనిచేసిన ఆటగాళ్లు సైమండ్స్ కు  కన్నీటి నివాళి పలుకుతున్నారు. 

Gone Too Soon: Harbjahan Singh paid his Tribute to Andrew Symonds
Author
India, First Published May 15, 2022, 3:49 PM IST

క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతూ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. సైమండ్స్ మృతిపై  ప్రపంచవ్యాప్తంగా అతడి అభిమానులతో పాటు అతడితో కలిసి ఆడిన  ఆటగాళ్లు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సైమండ్స్ అంటేనే  భారత క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చే  పేరు హర్భజన్ సింగ్. 2008లో మంకీగేట్ వివాదంతో ఈ ఇద్దరూ గొడవకు దిగారు.  సైమండ్స్ మరణంపై హర్భజన్ సింగ్ కూడా షాక్ కు గురయ్యాడు.  ‘ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా..’ అంటూ తన సంతాపాన్ని ప్రకటించాడు. 

సైమండ్స్ మరణం తెలిసిన తర్వాత భజ్జీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆండ్రూ సైమండ్స్ మరణవార్త నన్ను షాక్ కు గురి చేసింది. చాలా  త్వరగా వెళ్లిపోయాడు.. సైమో కుటుంబానికి, సన్నిహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. అతడి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా..’ అని ట్వీట్ చేశాడు. 

 

భజ్జీ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ కూడా సైమండ్స్ అకాల మృతిపై స్పందించాడు. ‘కార్ యాక్సిడెంట్ లో సైమండ్స్ మరణించాడన్న వార్త  వినాల్సి రావడం బాధాకరం. తాను ఆడిన కాలంలో  అతడు మంచి ఆటగాడు. సైమో మృతి ప్రపంచ క్రికెట్ కు తీరని లోటు. సైమండ్స్ కుటుంబానికి అతడి సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి..’ అని వీరూ ట్విటర్ లో రాసుకొచ్చాడు. 

 

2008 లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా) లో భాగంగా ఈ ఇద్దరి  మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.  సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో భజ్జీ తనను ‘మంకీ’ అన్నాడని సైమండ్స్ ఆరోపించాడు. జాతి వివక్ష కామెంట్లు కూడా చేశాడని నానా యాగి చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య  జరగాల్సిందంతా జరిగింది. 

అయితే విచారణలో మాత్రం భజ్జీ.. సైమండ్స్ ను మంకీ అనలేదని, ‘మా..కీ’ అన్నాడని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్ లో ఉన్న సచిన్ సాక్ష్యం చెప్పడంతో ఈ వివాదం మరో మలుపుతిరిగింది. భజ్జీ ఏం తప్పు చేయకున్నా ఐసీసీ అతడిపై మూడు మ్యాచుల నిషేధం విధించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన బీసీసీఐ.. పర్యటనను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధమైంది.  కానీ పరిస్థితిని అర్థం చేసుకున్న ఐసీసీ.. నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ వివాదం అంతటితో ముగిసింది.  కానీ తదనంతర కాలంలో భజ్జీ, సైమండ్స్ లు కలిసి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడటం  విశేషం.  పాత పగలు మరిచి  స్నేహితుల్లా కలిసిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios