టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సలహాతోనే ఈ స్థాయికి ఎదిగాడని మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిర్‌స్టన్‌ మాట్లాడుతూ.. 2008లో విరాట్‌ను తొలిసారి చూసినప్పుడే అతడి అద్భుత ప్రతిభను గుర్తించానని, 2008 శ్రీలంకతో సిరీస్‌లో విరాట్‌కు ఓ సలహా ఇచ్చానని, అప్పటి నుంచి అతడు అది పాటిస్తున్నాడని అన్నాడు.

 శ్రీలంకతో ఓ వన్డేలో బాగా ఆడి 30పరుగులవద్ద లాంగాన్‌ మీదుగా సిక్సర్‌కు ప్రయత్నించి ఔటయ్యాడని, అప్పుడు తాను విరాట్‌తో... నీ ఆట తర్వాతి స్థాయికి వెళ్లాలంటే, బంతిని గాల్లోకి లేపకుండా నేలపైనే వెళ్లేలా బాదాలి. బంతిని బౌండరీ దాటించగలనని నీకు తెలిసినప్పుడు సిక్సర్‌కు ప్రయత్నించడమెందుకు? అని సలహా ఇచ్చానని చెప్పాడు. అది సలహాను పాటించిన కోహ్లీ తర్వాతి మ్యాచ్‌లోనే శతకం బాదాడని కిర్‌స్టన్‌ గుర్తుచేశాడు.

ఇకపోతే... కరోనా దెబ్బకు ప్రపంచమంతా దాదాపుగా లాక్ డౌన్ లోనే కొనసాగుతుంది. ఈ కరోనా పుణ్యమాని అన్ని క్రీడా వేడుకలు కూడా వాయిదాపడ్డాయి. విశ్వక్రీడలు ఒలింపిక్స్ ఏ వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. ఇక ఈ కరోనా పంజా ఇప్పుడప్పుడు వదిలేలా లేకపోవడంతో అభిమానులు లేకుండా క్రీడలు నిర్వహించే ఆలోచన తెరపైకి వస్తుంది( ఇప్పటికే కొన్ని మ్యాచులు అలా జరిగాయి కూడా). 

అభిమానుల నడుమ ఆట కిక్కే వేరు. సాకర్‌లో, క్రికెట్‌లో అభిమానులు ఆటకు కొత్త దృక్కోణాలను తీసుకువస్తారు. ఫలితాన్ని సైతం అభిమాన గణం శాసిస్తుందనటం అతిశయోక్తి కాదు. ప్రత్యర్థి జట్టును కవ్వించటం, పొరపాట్లు చేసేలా రెచ్చగొట్టడం, ఫ్లకార్డులతో మానసికంగా దెబ్బతీయటం వంటి ఎన్నో అంశాలను అభిమానులు ప్రభావితం చేయగలరు. 

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ సమరంలో, భారత్, పాక్ క్రికెట్ సంరంభంలో అభిమానుల పాత్ర ఇక్కడ ప్రస్తానార్హం. భారత్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ అనగానే స్టేడియం నిండు కుండలా తయారవుతోంది. నిండైన స్టేడియంలో ఆట క్రికెటర్లకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. 

క్రికెట్‌ సైతం అభిమానుల్లేని ఆటకు మానసికంగా సిద్ధమవుతోంది. అభిమానుల్లేని ఆటపై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాసక్తత వ్యక్తం చేసినా, మరో మార్గం లేదంటున్నాడు.  

అభిమానులు లేకుండా ఆట సాధ్యమేనని. బహుశా ఇది జరిగే అవకాశం కనిపిస్తోందని విరాట్ కోహ్లీ అన్నాడు. నిండైన స్టేడియాల్లో ఆటకు అలవాటుపడ్డందున,  అభిమానుల్లేకుండా ఆటను క్రికెటర్లు ఏ విధంగా చూస్తారో తెలియదని విరాట్ అన్నాడు. 

మంచి స్ఫూర్తితోనే ఆట సాగినప్పటికీ... మ్యాచ్‌ ఉత్కంఠతో అభిమానులు, స్టేడియం, క్రీడాకారులు అందరూ ఒక్కటయ్యే భావోద్వేగం ఇక్కడ కోల్పోతామని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 

ఏదిఏమైనా ఆట సాగుతుందని, కానీ అభిమానులు తీసుకొచ్చే ఆ మ్యాజిక్‌ను వేరే ఎవ్వరూ సృష్టించలేరని విరాట్‌ కోహ్లి తన మనసులో మాటను బయటపెట్టాడు.