T20I World Cup 2022: త్వరలో ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ లో సత్తా చాటాలని భావిస్తున్న నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు ఆ దిశగా గట్టి ప్రణాళికలే రచిస్తున్నది. ఈ మేరకు టీమిండియా మాజీ హెడ్ కోచ్ ను జట్టు సలహాదారుడిగా నియమించుకున్నది.
టీమిండియాకు 2011లో వన్డే ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్.. త్వరలో నెదర్లాండ్స్ జట్టు రాతను మార్చనున్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కిర్‌స్టెన్.. నెదర్లాండ్స్ జట్టుకు సలహాదారుడిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు క్రికెట్ నెదర్లాండ్స్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. కిర్‌స్టెన్ తో పాటు ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ డాన్ క్రిస్టియన్ ను కూడా నెదర్లాండ్స్ జట్టుకు సలహాదారుడిగా నియమితుడయ్యాడు.
టీ20 ప్రపంచకప్ ఆడేందుకు గాను ఆస్ట్రేలియాకు వెళ్లడానికి ముందు నెదర్లాండ్స్ జట్టు.. కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) లో ఉన్న కిర్‌స్టెన్ క్రికెట్ అకాడమీ లో శిక్షణ పొందింది. నెదర్లాండ్స్ హెడ్ కోచ్ ర్యాన్ కుక్ తో కలిసి కిర్‌స్టెన్.. జట్టుకు విలువైన క్రికెట్ పాఠాలు బోధించాడు.
కిర్‌స్టెన్ పనితనం మెచ్చిన నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు.. ఈ ప్రపంచకప్ లో అతడిని తమ కన్సల్టంట్ గా నియమించుకుంది. ఇక అడిలైడ్ లో డచ్ (నెదర్లాండ్స్ పాత పేరు) ఆటగాళ్లకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్ లో ఆసీస్ ఆల్ రౌండర్ క్రిస్టియన్ కూడా కలువనున్నాడు. ఈ ఇద్దరి అనుభవం తమకెంతో ఉపయోగపడుతుందని క్రికెట్ నెదర్లాండ్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలాఉండగా టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించేందుకు గాను నెదర్లాండ్స్ ముందు క్వాలిఫయింగ్ రౌండ్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ 16న ఆ జట్టు తొలుత యూఏఈతో తొలి మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్-ఏ లో నమీబియా, శ్రీలంకలు కూడా ఉన్నాయి. యూఏఈతో మ్యాచ్ తర్వాత అక్టోబర్ 18న నమీబియా, 20న శ్రీలంకతో ఆడనుంది. గ్రూప్ లో టాప్-2గా ఉన్న జట్లు గ్రూప్-12 స్టేజ్ కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 21 నుంచి అసలు సిసలు సమరం మొదలుకానున్న విషయం తెలిసిందే.
