Asianet News TeluguAsianet News Telugu

గాల్వాన్ దురాగతం: వివో సహా చైనా కంపెనీల ఐపీఎల్ స్పాన్సర్షిప్ రివ్యూ

చైనాకు సంబంధించిన కంపెనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు వచ్చే వారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయం తీసుకోనుంది టైటిల్ స్పాన్సర్ వివో విషయంలో! సంవత్సరానికి 440 కోట్ల కాంట్రాక్టు పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు

Galwan Valley Incident: BCCI to review IPL sponsorship Deals Including VIVO
Author
Mumbai, First Published Jun 20, 2020, 7:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గాల్వాన్ లోయలో దాష్టీకానికి పాల్పడి 20 మంది సైనికులను చైనా బలిగొన్న నేపథ్యంలో.... ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్స్ అన్నిటిని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. చైనాకు సంబంధించిన కంపెనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు వచ్చే వారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ. 

ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయం తీసుకోనుంది టైటిల్ స్పాన్సర్ వివో విషయంలో! సంవత్సరానికి 440 కోట్ల కాంట్రాక్టు పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. " సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణల్లో మన సైనికులు 20 మంది వీరమరణం పొందినందువల్ల ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్స్ ని పునఃసమీక్షించాలని నిర్ణయించాం" అని ఐపీఎల్ ట్విట్టర్ లో తన అధికారిక ఖాతా నుండి రాత్రి పొద్దుపోయాక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ని బీసీసీఐ హ్యాండిల్ కూడా రీట్వీట్ చేసింది. 

వివో ప్రధాన కాంట్రాక్టు తోపాటుగా, చైనా పెట్టుబడులు ఉన్న డ్రీం ఎలెవన్, పేటిఎం లపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. భారత్ లో అంతర్జాతీయ క్రికెట్ కు 5 సంవత్సరాలకు 326 కోట్ల కాంట్రాక్టును కలిగి ఉంది  పేటిఎం కంపెనీ. 

గురువారం రోజు అరుణ్ ధూమల్ చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది. వివో స్పాన్సర్షిప్ వల్ల భారతదేశానికే లాభం కలుగుతున్నందున... ఎందుకు ఆ స్పాన్సర్షిప్ ను తొలిగించాలని ఆయన అన్నారు. 

కాకపోతే బీసీసీఐ అధికారిక నిర్ణయం తీసుకున్న తరువాత తమకందరికీ దేశమే ముందు అని చెప్పుకొచ్చారు. చైనా వ్యతిరేక సెంటిమెంట్ల దృష్ట్యా చైనా వస్తువుల సంపూర్ణ బ్యాన్ ను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని అన్నాడు. 

ఇకపోతే... టి 20 ప్రాపంచ కప్ పై ఐసీసీ ఎటూ తేల్చకపోతుండడంతో.... బీసీసీఐ మాత్రం ఐపీఎల్ నిర్వహించేందుకు పావులు కదుపుతుంది. నాలుగువేల కోట్ల ఆదాయాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు బీసీసీఐ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఐపీఎల్ తాత్కాలిక షెడ్యూల్ రూపొందించింది. 

ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు చెబుతామని ఇటీవల రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు రాసిన లేఖలో పేర్కొన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. ఆ దిశగా తొలి అడుగు వేసినట్టు కనిపిస్తోంది. 

వర్థమాన, భవిష్యత్‌ పరిస్థితులను బేరీజు వేసుకుని ఐపీఎల్‌13కు తాత్కాలిక షెడ్యూల్‌ రూపొందించారు. సెప్టెబర్‌ 26న ఆరంభం కానున్న ఐపీఎల్‌, నవంబర్‌ 8న టైటిల్‌ పోరుతో ముగియనుంది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక షెడ్యూల్‌ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. బీసీసీఐ ఐపీఎల్‌ నిర్వహణకు పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో ఈ ఏడాది ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌ ఉండనట్టే!

జూన్‌ 10 ఐసీసీ టెలీ కాన్ఫరెన్స్‌ సమావేశంలో టీ20 వరల్డ్‌కప్‌పై ఏటూ తేల్చలేదు. మరో నెల రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఐసీసీ సమావేశం ముగిసిన వెంటనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖ ఆసక్తి రేకెత్తించింది. నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌2020ని పట్టాలెక్కించేందుకు బీసీసీఐ విస్తృత సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. 

భారత్‌లో నిర్వహించాల్సి వస్తే పిచ్‌లు, స్టేడియాలను సిద్ధంగా ఉంచేందుకు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో సమన్వయం సహా నిర్వహణ సాధ్యమైన షెడ్యూల్‌పై ఐపీఎల్‌ ప్రాంఛైజీలు, ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్‌ ఇండియాతో బీసీసీఐ సంప్రదింపులు చేసింది. ప్రస్తుత పరిస్థితుల బేరీజు, రాబోయే రోజుల్లో పరిస్థితిపై అంచనా ఆధారంగా సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు ఐపీఎల్‌ నిర్వహణకు మేలైన సమయంగా బీసీసీఐ భావిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా, రద్దు లేదా రీ షెడ్యూల్‌ ఆధారంగా ఐపీఎల్‌ తాత్కాలిక షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios