ICC Awards 2021: గతేడాది అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. టెస్టులు, వన్డేలు, టీ20 లు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో రాణించిన ఆమెకు...
భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ లో ఆటగాళ్లు ఒక్కసారైనా దక్కించుకోవాలని కలలుగనే అవార్డును ఆమె సొంతం చేసుకుంది. 2021 ఏడాదికి గాను ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు గెలుచుకుంది. ఈ మేరకు ఐసీసీ.. సోమవారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మంధాన తో పాటు ఇతర విభాగాల్లో కూడా ఐసీసీ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులలో పాకిస్థాన్ పంట పండింది. ఈ ఏడాది ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంతో జట్టుగానే గాక ఆటగాళ్ల పరంగా కూడా పాకిస్థానీలు అవార్డులను కొల్లగొట్టారు. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఈయర్ గా కూడా ఆ జట్టుకే అవార్డులు దక్కాయి.
గతేడాది స్మృతి మంధాన అద్భుతంగా రాణించింది. స్వదేశంలో జరిగిన సౌతాప్రికా సిరీస్ తో పాటు ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మంధాన మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ సిరీస్ లో భాగంగా జరిగిన ఏకైక టెస్టులో 78 పరుగులు చేసింది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్ లలో కూడా రాణించింది. ఇక గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కూడా అద్భుతంగా ఆడింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ అవార్డు దక్కడం గమనార్హం.
ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితా :
- ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - టామీ బ్యూమోంట్ (ఇంగ్లాండ్)
- ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - స్మృతి మంధాన (ఇండియా)
- ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - ఫాతిమా సనా (పాకిస్థాన్)
- ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - ఆండ్రియా (ఆస్ట్రియా)
- ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - జో రూట్ (ఇంగ్లాండ్)
- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)
- ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - జన్నేమన్ మలన్ (సౌతాఫ్రికా)
- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - జీషన్ మసూద్ (ఓమన్)
- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - బాబర్ ఆజమ్ (పాకిస్థాన్)
- ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ - షాహీన్ అఫ్రిది (పాకిస్థాన్)
- ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఈయర్ - మారియస్ ఎరాస్మస్
(ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఇంకా ప్రకటించాల్సి ఉంది)
బాబర్ ఆజమ్.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ తో పాటు ఇటీవలే ప్రకటించిన ఐసీసీ వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్ గా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. 2021 లో పాక్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంలో ఆజమ్ తో పాటు మహ్మద్ రిజ్వాన్ లు కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరికీ అవార్డులు దక్కడం గమనార్హం.
ఇప్పటికే ఐసీసీ.. పురుషుల టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మహిళల వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. పురుషుల వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను ఎంచుకున్న ఐసీసీ.. టెస్టులకు మాత్రం కేన్ విలియమ్సన్ ను నియమించింది. టీ20, వన్డే జట్లలో చోటు దక్కని భారత ఆటగాళ్లకు టెస్టులలో మాత్రం స్థానం దక్కింది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు జట్టులో ఉన్నారు.
