Asianet News TeluguAsianet News Telugu

7 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయినా విజయం వాళ్లదే.. కౌంటీలో లంకాషైర్ అద్భుతం..

County Championship: ఏడు పరుగులకు ఆరు వికెట్లు  కోల్పోయిన జట్టు.. మ్యాచ్ గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా..? అదీ టెస్టులో. కానీ   లంకాషైర్ జట్టు అద్భుతం చేసింది. 

From 7/6 to victory, Lancashire recover from hopeless position to Win The Match Against Essex In County Championship
Author
First Published Sep 22, 2022, 1:24 PM IST

క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తుంటారు. మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. అసలు ఆశలే లేవు, ఇక ఓటమి ఖాయమనుకున్న జట్టు అనూహ్యంగా పుంజుకుని గెలవడం.. విజయం చివరి అంచుల వద్దకు వచ్చి గెలుపు ముంగిట బోల్తా కొట్టిన సందర్భాలు  చరిత్రలో లిఖించబడి ఉన్నాయి.  ఆ కోవలోకి మరో మ్యాచ్ కూడా చేరింది. ఏడు పరుగులకు ఆరు వికెట్లు  కోల్పోయిన జట్టు.. మ్యాచ్ గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా..? అదీ టెస్టులో. కానీ   లంకాషైర్ జట్టు అద్భుతం చేసింది.  పట్టుదలగా ఆడి అనూహ్య విజయాన్ని అందుకుంది. 

వివరాల్లోకెళ్తే.. ఇంగ్లండ్ లోని కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ లో  భాగంగా  మూడు రోజుల టెస్టు మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. లంకాషైర్-ఎసెక్స్ మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన లంకాషైర్  131 పరుగులకే కుప్పకూలింది. టామ్ హార్ట్లీ (24) టాప్ స్కోరర్. 

తొలి ఇన్నింగ్స్ లో ఎసెక్స్.. 107 పరుగులకే  ఆలౌటైంది. ఆ జట్టులో  ఇంగ్లాండ్ జట్టు మాజీ సారథి అలిస్టర్ కుక్ (40) టాప్ స్కోరర్.  అతడు తప్ప మిగిలినవారంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. ఫలితంగా లంకాషైర్ కు  24 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. 

ఇక రెండో ఇన్నింగ్స్ లో  లంకాషైర్.. ఎసెక్స్ బౌలర్ల ధాటికి గజగజ వణికింది. స్కోరుబోర్డుపై పట్టుమని పది పరుగులు కూడా చేరకుండానే టాప్-6 బ్యాటర్లు పెవిలియన్ చేరారు. లూక్ వెల్స్ (0), కీటన్ జెన్నింగ్స్ (2),  జోష్ బోహన్నన్ (0), స్టీవెన్ క్రాఫ్ట్ (0), డేన్ విలాస్ (0),  జార్జ్ బాల్డర్సన్ (3) లు అలా వచ్చి సంతకం పెట్టి ఇంటికి వెళ్లినట్టు పెవిలియన్ చేరారు. 7 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో  జార్జ్ బెల్ (24), టామ్ హార్ట్లీ (23) లు కాస్త ప్రతిఘటించారు. కానీ వాళ్లు కూడా నిష్క్రమించడంతో లంకాషైర్.. 73 పరుగులకు  ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 24 పరుగుల ఆధిక్యం కలుపుకుని.. ఎసెక్స్ ముందు 97 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 

 

ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ఎసెక్స్ కు చుక్కలు కనిపించాయి.   లంకాషైర్ బౌలర్ జార్జ్ బాల్డర్సన్..  7 ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది.  విల్ విలియమ్స్  కూడా 8 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.  ఎసెక్స్ బ్యాటర్లలో కుక్ (14), టామ్ వెస్ట్లీ (13) మిగిలినవారెవరూ డబుల్ డిజిట్ కూడా చేరలేదు.  విల్ విలియమ్స్, బాల్డర్సన్ ధాటికి ఎసెక్స్.. 22 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా లంకాషైర్ 38 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios