లాహోర్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దు ఖాదిర్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 63 ఏళ్లు. తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో  చేర్పించారు. లాహోర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 

పాకిస్తాన్ వికెట్ కీపర్, ఉమర్ సోదరుడు కమ్రాన్ అక్మల్ ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. ఖాదిర్ హఠాన్మరణంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత ఇష్టమైన క్రికెటర్ ఖాదిర్. పలువురు క్రీడాకారులు, అభిమానులు ఖాదిర్ కు సంతాపం ప్రకటించారు. 

ప్రపంచ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం కొనసాగుతున్న 70-80 దశకాల్లో తన బౌలింగ్ యాక్షన్ ద్వారా, మణికట్టు స్పిన్ మాయాజాలం ద్వారా అద్భుత విజయాలు అందించిన ఘనత ఖాదిర్ కు ఉంది. 

అంతర్జాతీయ క్రికెట్ లో ఖాదిర్ 67 టెస్టులు, 104 వన్డేలు ఆడాడారు. మొత్తం 368 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2009లో ఖాదిర్ చీఫ్ సెలెక్టర్ గా పనిచేశాడు. ఇంగ్లాండులో ఐసిసి టీ20 ప్రపంచ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టును ఖాదిర్ ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ను ఎంపిక చేయకపోవడంపై మాజీ పిసిబి చైర్మన్ ఎజాజ్ బట్ తో విభేదాలు రాడంతో చీఫ్ సెలెక్టర్ పదవికి ఖాదిర్ రాజీనామా చేశాడు. 

అబ్దుల్ ఖాదిర్ కు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కుమారులు రెహ్మాన్, ఇమ్రాన్, సులేమన్, ఉస్మాన్ ఫస్ట్ క్లాస్ స్థాయి క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు ఆడుతున్న ఉమర్ అక్మల్ ఖాదిర్ అల్లుడు. ఖాదిర్ జీవించి ఉంటే సెప్టెంబర్ 15వ తేదీన 64వ పుట్టిన రోజు జరుపుకుని ఉండేవారు.