గత కొన్ని రోజులుగా భారత క్రికెట్లో చర్చకు వస్తున్న విషయం ఏమైనా ఉందంటే అది ధోని రిటైర్మెంట్ ముచ్చటే. ధోని రిటైర్మెంట్ అనే చర్చ రాగానే ఇటు ధోని మద్దతుదారులు, అతడిని రిటైర్మెంట్ తీసుకోవాలనే వారు సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేయడం పరిపాటయ్యింది. 

ఇటీవలే తాజాగా ధోనిని ఆటగాళ్ల జాబితా నుండి తొలగించి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన బీసీసీఐ అందులో ధోనికి అవకాశం ఇవ్వలేదు. 

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో ధోని పేరు కాంట్రాక్ట్‌ లిస్టులో లేకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని, ముఖ్యంగా దీని అభిమానులను విస్మయానికి గురి చేసింది. 

ధోని ఖేల్ ఖతం, ధోని శకం ఇక ముగిసిందంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ధోనికి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ధోని పేరును జాబితాలోంచి తొలగించామని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు అధికారిక ప్రకటన చేసారు కూడా. 

ఇక టీమిండియా వార్షిక  కాంట్రాక్టులో చోటు దక్కని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆశ్చర్యకరమైన చర్యకు దిగాడు. తనలో ఇంకా సత్తువ ఉందని నిరూపించుకోవడానికో ఏమో అన్నట్లు మైదానంలోకి అందరినీ ఆశ్చర్య పరిచాడు. వార్షిక కాంట్రాక్టులో చోటు కోల్పోయిన రోజునే ఆయన ఆ పనిచేశాడు. 

తన సొంత నగరం రాంచీలో జార్ఖండ్ రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఓ వైపు ధోనీని బీసీసీఐ కాంట్రాక్టు జాబితా నుంచి తొలగిస్తే మరోవైపు అతను బ్యాటింగ్ ప్రాక్టిస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ లోనే కాకుండా రెగ్యులర్ ట్రైనింగులో కూడా పాల్గొన్నాడు.

Also Read: టీమిండియాలో ధోనీ.. ఇక ఛాన్స్ లేదంటున్న హర్భజన్ సింగ్

ఆ విషయాన్ని జార్ఖండ్ టీమ్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేస్తే ధోనీ మాత్రం తెల్ల బంతితో ప్రాక్టీస్ చేశాడు. తద్వారా తాను ఐపిఎల్ టోర్నమెంట్ కు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. 

ధోనీ ఐపిఎల్ టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపిఎల్ లో చేసే ప్రదర్శనను బట్టే టీ20 ప్రపం కప్ పోటీల్లో ధోనీ చోటు దక్కుతుందా, లేదా అనేది ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. 

Also Read: ధోనీ ఖేల్ ఖతమ్: తేల్చేసిన బీసీసీఐ, తెలుగు క్రికెటర్ ఒకే ఒక్కడు

అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావిస్తున్నారు. కానీ, ఐపిఎల్ మీదనే అతని రీఎంట్రీ ఆధారపడి ఉంటుందని చర్చ ఒకటి నడుస్తుంది. కాంట్రాక్టు జాబితాలో పేరు లేకపోయినప్పటికీ ప్రపంచ కప్ పోటీలకు ఎంపికయ్యే అవకాశం అతనికి ఉందని అంటున్నారు.

ధోని టీం ఇండియా భవితవ్యంపై క్లారిటీ కోసం అందరూ చూస్తుండగా ధోని ఐపీఎల్ భవితవ్యంపై మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. శనివారం ఒక ఈవెంట్‌కు హాజరైన చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్‌.. ధోని ఐపీఎల్‌ భవితవ్యంపై క్లారిటీ ఇచ్చారు.   

ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా ధోని ఐపీఎల్‌ లో ఆడతాడని గంటాపథంగా చెప్పారు శ్రీని. 2020 ఐపీఎల్‌తో పాటు 20021 ఐపీఎల్‌లో కూడా ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడని... బరిలోకి దిగడమే కాదు తానే నాయకుడని స్పష్టం చేసాడు శ్రీనివాసన్. 

ధోనిపై తమకు అపారమైన నమ్మకం ఉందని, వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లలో కూడా తమ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోని నేతృత్వంలోనే ఆడుతుందని కుండబద్ధలుకొట్టారు.