Asianet News TeluguAsianet News Telugu

ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్‌తో ఆగిన ఆట... లాహోర్‌లో ఆఖరి మ్యాచ్‌లో వింత పరిస్థితి!

లాహోర్‌లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌కి అడ్డంకిగా మారిన సాంకేతిక లోపం... ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్‌తో పావుగంటకు పైగా ఆగిన ఆట.. 

floodlights failure stops play in Lahore, Asia Cup 2023 Pakistan vs Bangladesh match interrupted CRA
Author
First Published Sep 6, 2023, 7:20 PM IST | Last Updated Sep 6, 2023, 7:29 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీ ఎక్కడ జరిగినా అవాంతరాలు మాత్రం తప్పడం లేదు. శ్రీలంకలో జరుగుతున్న మ్యాచులకు వాతావరణం అడ్డుగా మారితే, లాహోర్‌లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌కి సాంకేతిక లోపం అడ్డంకిగా మారింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగుతుంది. ఆసియా కప్ టోర్నీలో పాక్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ ఇదే..

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 194 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్, 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ఈ సమయంలో ఫ్లడ్ లైట్స్‌ ఫెయిల్యూర్‌తో మ్యాచ్‌‌కి కాసేపు అంతరాయం కలిగింది.  దాదాపు 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది..

ఫ్లడ్ లైట్ ఆఫ్ కావడంతో గ్రౌండ్‌లో చాలా భాగం చిమ్మచీకటి కమ్ముకుంది. దీంతో అభిమానులు తమ మొబైల్ ఫోన్ లైట్స్ ఆన్ చేశారు. ఈ సాంకేతిక లోపం పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు రావడానికి కారణమైంది. వాస్తవానికి ఆసియా కప్ 2023 మ్యాచులన్నీ పాకిస్తాన్‌లో జరగాల్సింది.

భారత జట్టు, పాక్‌లో పర్యటించడానికి అంగీకరించకపోవడంతో పాక్‌లో 4 మ్యాచులు, శ్రీలంకలో 9 మ్యాచులు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. లంకలో జరిగే మ్యాచులకు వర్షం అడ్డంకిగా మారింది..

కొలంబోలో సూపర్ 4, ఫైనల్ మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే కొలంబోలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 9, 10 తేదీల కల్లా కొలంబోలో వర్షాలు తగ్గుతాయని ఏసీసీ భావిస్తోంది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లలో 193 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో అదరగొట్టిన మెహిదీ హసన్ మిరాజ్, నసీం షా బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ మొహమ్మద్ నయీం 25 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేయగా లిట్టన్ దాస్ 13 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. 

తోహిడ్ హృదయ్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ దశలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం కలిసి ఐదో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత 57 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, ఫహీం ఆష్రఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  

23 బంతుల్లో ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన షమీమ్ హుస్సేన్‌ని ఇఫ్తికర్ అహ్మద్ అవుట్ చేశాడు. 87 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీం, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికి టస్కిన్ అహ్మద్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.  అతిఫ్ హుస్సేన్ 12, షోరిఫుల్ ఇస్లాం 1 పరుగు చేసి నసీం షా బౌలింగ్‌లో అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 38.4 ఓవర్లలో ముగిసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios