టీమిండియా యువ క్రికెటర్ దీపక్ చాహర్ తండ్రి పట్టరాని ఆనందంలో మునిగితేలుతున్నారు. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా  బంగ్లాదేశ్ తో నాగ్ పూర్ వేదకగా జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో దీపక్ చాహర్ ఇరగదీశాడు. తన బౌలింగ్ తో బంగ్లా జట్టుకి చెమటలు పట్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు వికెట్లు పడగొట్టాడు. టీమిండియా విజయంలో చాహర్ కీలక పాత్ర పోషించాడు.

కాగా... కొడుకు విజయం చూసి చాహర్ తండ్రి మురిసిపోతున్నాడు. తన కొడుకు ఇచ్చిన అద్భుత ప్రదర్శన తనకు పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చిందని చాహర్ తండ్రి లోకేంద్రసింగ్ చాహర్ తెలిపారు.

భారత వాయుదళంలో పని చేసి రిటైరైన లోకేంద్రసింగ్.. తన కుమారుడి ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఈ ప్రదర్శనకి ముందు అతను కనీసం ఓ లక్ష బంతులు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. మా ఇద్దరి కల నెరవేరిందని అనిపిస్తుంది. అతను ఎన్నో గాయాలను దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు. అందుకు ప్రతిఫలం లభించిందని అనుకుంటున్నాను. గాయాలను తట్టుకొని నిలబడటం కూడా ముఖ్యమే’’ అని ఆయన పేర్కొన్నారు.
 
కాగా, దీపక్‌లో ఉన్న ప్రతిభను ఎంఎస్ ధోనీ గుర్తించి.. తను అవకాశం ఇచ్చాడని ఆయన తెలిపారు. ఐపీఎల్‌లో చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి.. అద్భుత ప్రదర్శన చేశాడు. ‘‘రిడ్ బాల్‌ని ఎలా స్వింగ్ చేయాలో చాహర్‌కి ముందు నుంచే తెలుసు. డ్వేన్ బ్రావో లేకపోవడంతో.. అతనికి పవర్‌ప్లేలో, డెత్ ఓవర్‌లో బౌలింగ్ చేసే సత్తా ఉందని ఎంఎస్ ధోనీ నమ్మాడు. అదే దీపక్ జీవితాన్ని మలుపు తప్పింది. ప్రతీ సారి స్వింగ్ బౌలింగ్ చేయవద్దని, కొన్నిసార్లు వైడ్ యార్కర్లు, వైడ్ స్లోవర్‌లు వేయాలని అతను నేర్చుకున్నాడు’’ అని ఆయన అన్నారు. 
 
అయితే తాను ఉద్యోగాన్ని ఎటువంటి అనుమానం లేకుండా మానేశానని ఆయన అన్నారు. 12 సంవత్సరాల వయస్సులో చాహర్‌ బౌలింగ్ చూసి అతను ఎప్పటికైనా.. ప్రయోజకుడు అవుతాడనే నమ్మకం తనకు వచ్చిందని ఆయన పేర్కొ్న్నారు. ‘‘నేను క్రికెటర్ అవుదామని అనుకున్నాను. కానీ మా నాన్న అందుకు అంగీకరించలేదు. కానీ, నా కొడుకు విషయంలో అలా చేయాలని అనిపించలేదు. అతని కల, నా కల ఒక్కటే అనే విషయాన్ని అతనికి తెలిసేలా చేశాను. నాకు కోచింగ్‌లో ఎటువంటి డిగ్రీ లేదు.. కానీ చాహర్‌కి కొన్ని విషయాలు నేర్పించాను. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ట్రైనింగ్ కారణంగా అతను స్కూల్‌కి తరచుగా వెళ్లే పరిస్థితి లేదు. అప్పుడు 24 గంటల సమయం కూడా తక్కువ అనిపించేది. ట్రైనింగ్, జిమ్ అన్ని చేస్తూనే.. అతను డిగ్రీ కూడా పూర్తి చేశాడు’’ అని ఆయన తెలిపారు. ఎప్పటికైనా.. చాహర్ గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.