న్యూడిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన విషయం తెలిసిందే. తనదైన చలోక్తులు, పంచులతో చెప్పాల్సిన విషయానికి కాస్త హాస్యం జోడించడం సెహ్వాగ్ స్టైల్. ఇలా ప్రస్తుత క్రికెట్, ఆటగాళ్ళు, రికార్డులు ఇలా ప్రతి విషయాలను సోషల్ మీడియా వేదికన నిర్వహిస్తున్న ''వీరు కి బైటక్'' కార్యక్రమం ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు సెహ్వాగ్.  

ఈ సందర్భంగా ఇటీవల వెస్టిండిస్ దిగ్గజం బ్రియాన్ లారా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సెహ్వాగ్. టెస్ట్ క్రికెట్లో లారా పేరిట వున్న 400 వ్యక్తిగత పరుగుల రికార్డును బద్దలుగొట్టే సత్తా ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే వుందన్నాడు. ఒకరు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కాగా మరెకరు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్. 

''లారా రికార్డును బద్దలుగొట్టడం రోహిత్ శర్మకు చాలా సులువు. అతడు ఒకటిన్నర రోజులు ఔటవకుండా వుంటే ఈ రికార్డు బద్దలవడం ఖాయం. అలాగే వార్నర్ కు కూడా ఈ రికార్డును బద్దలుగొట్టే సత్తా వుంది'' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 

2004 ఏప్రిల్ లో ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని లారా 400 పరుగులను సాధించి టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. టీ20 రాకతో బ్యాటింగ్ వేగం పెరిగినా ఏళ్లనాటి లారా రికార్డు  మాత్రం చెక్కుచెదరడం లేదు. అయితే ఈ రికార్డును రోహిత్, వార్నర్ బద్దలుగొట్టే అవకాశాలున్నాయంటూ టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని విస్మరించారు సెహ్వాగ్.