టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ మహ్మద్‌ అజహ‌రుద్దీన్‌కు ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వాకింగ్, రన్నింగ్, ఎక్సర్‌సైజులు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటారు. అందుకే యాభై ఏడేళ్లంటే ఎవ్వరూ నమ్మరు.

తాజాగా అజహరుద్దీన్‌ ఎక్స‌ర్‌సైజ్ కోసం ఓ విల‌క్ష‌ణ‌మైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. క‌రోనా కాలం కాబ‌ట్టి జ‌న‌స‌మూహాలు అధికంగా ఉండే ప్రాంతం కాకుండా ఢిల్లీలోని మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి హుమాయున్ స‌మాధి ప్రాంతంలో మెట్ల‌ను అవ‌లీల‌గా ఎక్కుతూ వ్యాయామం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట‌ర్‌లో త‌న అభిమానుల‌తో పంచుకున్నారు.

తన జీవితంలో ఎక్స‌ర్‌సైజ్‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉందని.. అలాగే హుమాయున్ స‌మాధులు వంటి ప్ర‌త్యేక ప్ర‌దేశాల్లో చెమ‌ట‌లు చిందిస్తున్న‌ప్పుడు ఇది మ‌రింత వినోదంగా మారుతుంది" అని చెప్పారు.

ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు 'చాలా బాగుంది, అజ్జూ భాయ్..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. "మీ ఫిట్‌నెస్ గురించి చెప్ప‌డానికి మాట‌ల్లేవు. మీరు ఇప్పటికిప్పుడు టీమిండియాలో ఆడితే మూడు వంద‌ల ప‌రుగులు చేస్తారు.

ద‌య‌చేసి మీరు ఇట‌లీ జ‌ట్టుకు కోచింగ్ ఇవ్వండి" అంటూ మ‌రో నెటిజ‌న్ అభ్య‌ర్థించాడు. కాగా అజ‌హ‌ర్ గ‌తేడాది నుంచి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ)‌కు అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగతి తెలిసిందే.