WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా 400 ప్లస్ టార్గెట్ పెట్టిన ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్..
డబ్ల్యూటీసీ ఫైనల్ - 2023లో భాగంగా భారత జట్టు ఎదురీదుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఈ టెస్టుపై పూర్తిస్థాయిలో పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం (173) కలుపుకుని ఇప్పటికే ఆ జట్టు 296 పరుగుల ఆధిక్యంలో నిలిచి 400 దిశగా దూసుకెళ్తుంది. మరో రెండ్రోజుల ఆట మిగిలుండటం.. పిచ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ కు సమంగా అనుకూలిస్తుండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఆసీస్ 400 ప్లస్ టార్గెట్ ఇచ్చినా ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.
మూడో రోజు ఆట ముగిసిన తర్వాత శార్దూల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శార్దూల్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే..
ఛేదనపై..
‘క్రికెట్ చాలా ఫన్నీగేమ్. ఒక గేమ్ లో ప్రత్యర్థిని ఓడించడానికి సరైన లక్ష్యం ఎంత అనేది ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ప్రత్యేకించి ఐసీసీ ఫైనల్‌లో.. ఒత్తిడిని ఎవరైతే బాగా అధిగమించగలరో వాళ్లు విజేతగా నిలుస్తారు. ఒక్క మంచి భాగస్వామ్యం నమోదైతే 450 రన్స్ టార్గెట్ అయినా, అంతకుమించి అయినా ఈజీగా ఛేదించొచ్చు. గతేడాది ఇంగ్లాండ్.. మాపై సుమారు 400 లక్ష్యాన్ని ఛేదించింది. అదే మాకు స్ఫూర్తి. వాళ్లు (ఆసీస్) ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తారనేది నా చేతుల్లో లేదు. దాని గురించి ఇప్పుడే అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని గంటల్లోనే ఎన్నో మ్యాచ్ లు మలుపులు తిరగిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మేం రేపు పాజిటివ్ మైండ్‌సెట్ తో ఆడతాం..’అని అన్నాడు.
కాగా గతేడాది భారత జట్టు బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్టును ఇంగ్లాండ్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించి సిరీస్ ను 2-2 తో సమం చేసింది.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో రహానే తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఆస్వాదించానని, అతడు టాప్ క్లాస్ ప్లేయర్ అని శార్దూల్ అన్నాడు. ‘మేం ఒత్తిడిని స్వీకరించి క్రీజులో నిలిచాం. మేం డిసైడ్ చేసుకునే సిట్యూయేషన్ అక్కడ లేదు. ఒకరికొకరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం..’అని తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 296 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
